Global Vaartha
Date of Publish : 03/11/2026, 5:40 pm
Editor : భవ్య జర్నలిస్ట్

బేతంచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీఛార్జ్‌

  • రీకౌంటింగ్‌ ఆదేశాలపై వైసీపీ అభ్యర్థులు, ఏజెంట్ల ఆందోళన
  • కమిషనర్‌కు వ్యతిరేకంగా ధర్నా.. భారీగా పోలీసుల మోహరింపు
  • 28 వార్డుల్లో 19 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం

గ్లోబల్ వార్త- నంద్యాల : నంద్యాల జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ కౌంటింగ్‌ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో రీకౌంటింగ్‌కు ఆదేశించడంపై వైసీపీ అభ్యర్థులు, ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బేతంచర్ల నగర పంచాయతీలో మొత్తం 28 వార్డులు ఉండగా, వెల్లడైన ఆధిక్యతల ప్రకారం వైఎస్సార్‌సీపీ 19 వార్డుల్లో, టీడీపీ తొమ్మిది వార్డుల్లో ముందంజలో ఉన్నాయి. ఈ క్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ హరిప్రసాద్‌ రీకౌంటింగ్‌కు ఆదేశించడంతో వివాదం మొదలైంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రీకౌంటింగ్‌కు ఆదేశించారని వైసీపీ అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

రీకౌంటింగ్‌ పేరుతో బ్యాలెట్లను మార్చే కుట్ర జరుగుతోందని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ మేరకు కౌంటింగ్‌ కేంద్రం వద్ద కమిషనర్‌కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగాయి. తమ అభ్యంతరాలను పట్టించుకోవాలని, రీకౌంటింగ్‌ ఆదేశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి.సమాచారం అందుకున్న నంద్యాల జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్‌ కేంద్రం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేపట్టారు. దీంతో నిరసనకారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ పరిణామాలతో బేతంచర్ల కౌంటింగ్‌ కేంద్రం వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save