Global Vaartha
Date of Publish : 04/11/2026, 11:13 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.. నిందితుల నివాసాల్లో ఈడీ సోదాలు

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన అక్రమాల కేసులో బుధవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు చేస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదనరావు నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌తో పాటు మూల్యాంకనం జరిగిన మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్ రిసార్టులో కూడా ఈ సోదాలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గ్రూప్-1 మూల్యాంకనంతో సంబంధం ఉన్న క్యామ్‌సైన్ మీడియా, ఇతర ప్రైవేట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. గ్రూప్-1 మూల్యాంకనానికి చెల్లించిన నిధులు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై విచారణ జరుపుతోంది.2018లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. వాటి జవాబు పత్రాలకు డిజిటల్ మూల్యాంకనంతో పాటు రెండు దశల్లో మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు సిట్ నివేదిక తెలిపింది. మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో 84 రోజుల పాటు జవాబు పత్రాల మూల్యాంకనం జరిగినట్లు సిట్ గుర్తించింది. అర్హతలేని 66 మందితో గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం చేయించారని సిట్ ఆరోపించింది. మూల్యాంకనానికి క్యామ్‌సైన్ మీడియాకు రూ.1.14 కోట్లు, డిజిటల్ మూల్యాంకన సంస్థలకు రూ.1.38 కోట్లు చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడించింది. మూల్యాంకన పత్రాల్లో 287 బార్‌కోడ్ అసమానతలు, 169 స్లిప్పుల్లో కరెక్షన్ ఫ్లూయిడ్ వినియోగాన్ని గుర్తించినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. 173 మంది సాక్షులను విచారించి, ఫోరెన్సిక్ ఆధారాలను సిట్ పరిశీలించింది. గ్రూప్-1 మూల్యాంకన అక్రమాలపై 2025 ఏప్రిల్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదనరావును గతంలోనే అరెస్టు చేశారు. సిట్ దర్యాప్తు నేపథ్యంలో 2026 అక్టోబర్‌లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి తాజాగా సోదాలు నిర్వహించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save