Global Vaartha
Date of Publish : 05/11/2026, 7:11 am
Editor : భవ్య జర్నలిస్ట్

దేశంలో విద్యుత్‌ నిల్వకు ఊతం

  • దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వేగవంతంగా అనుసంధానం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది...
  • రూ.14,500 కోట్లతో వీజీఎఫ్‌ పథకం ద్వారా
  • 92 జీడబ్ల్యూహెచ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ అభివృద్ధి
  • 2030-31 వరకు పథకం అమలు

దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వేగవంతంగా అనుసంధానం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 92 గిగావాట్‌ అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌) గ్రిడ్‌ స్థాయి విద్యుత్‌ నిల్వ వ్యవస్థల అభివృద్ధికి రూ.14,500 కోట్లతో కూడిన వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఐదేళ్ల పాటు (2030-31 ఆర్థిక సంవత్సరం వరకు) ఈ పథకం అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా 30 జీడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌, 60 జీడబ్ల్యూహెచ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, 2 జీడబ్ల్యూహెచ్‌ ఎమర్జింగ్‌ స్టోరేజ్‌ టెక్నాలజీలకు మద్దతు ఇవ్వనున్నారు. దేశంలో ఇంకా ప్రారంభంకాని 92 జీడబ్ల్యూహెచ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ వ్యవస్థల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. ఇది దేశంలో ప్రస్తుతం ఉన్న గ్రిడ్‌ స్థాయి నిల్వ సామర్థ్యంలో 170 శాతానికి సమానమైన కొత్త సామర్థ్యాలను సృష్టించడానికి దన్నుగా నిలువనుంది. అలాగే 2031-32 నాటికి 411 జీడబ్ల్యూహెచ్‌ గ్రిడ్‌ స్థాయి ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ సామర్థ్యాన్ని చేరుకోవడానికి సహాయపడనుంది.
గణాంక వ్యవస్థ ఆధునికీకరణ
దేశంలోని గణాంక వ్యవస్థను ఆధునికీకరించేందుకుగాను రూ.4,371 కోట్లతో వికసిత్‌ భారత్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ స్టాటిస్టికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, అనలిటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (విస్తార్‌) పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం ఐదేళ్లపాటు (2030-31) వరకు అమల్లో ఉండనుంది.
దేశీయంగా కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌
కీలక ఖనిజాలైన లిథియం, నికెల్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో రూ.2,814 కోట్లతో కూడిన పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం 2030-31 వరకు అమల్లో ఉంటుంది. దేశంలో విలువ జోడింపునకు మద్దతు ఇవ్వడంతోపాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, వాల్యూ చెయిన్‌ను అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద రెండు లిథియం, రెండు నికెల్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అర్హత కలిగిన పెట్టుబడిపై 30 శాతం మూలధన సబ్సిడీ అందిస్తారు. ఒక్కో లిథియం లబ్ధిదారుకు రూ.500 కోట్లు, ఒక్కో నికెల్‌ లబ్ధిదారుకు రూ.900 కోట్ల గరిష్ఠ మూలధన మద్దతు ఉంటుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save