Date of Publish : 05/11/2026, 7:12 am
Editor : భవ్య జర్నలిస్ట్
మా వాళ్ల కోసం..వాసుదేవరెడ్డికి సిఫారసు చేశా..!
- జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రవాణా టెండర్‌ను తన అనుచరులకు ఇప్పించడానికి నాటి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డికి తాను సిఫారసు చేసిన మాట నిజమేనని...
- తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు: అంబటి
- మద్యం రవాణా స్కాంలో ఈడీ ముందు హాజరు
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రవాణా టెండర్‌ను తన అనుచరులకు ఇప్పించడానికి నాటి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డికి తాను సిఫారసు చేసిన మాట నిజమేనని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అంగీకరించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో పదవులు, పనుల కోసం అనుచరుల పేర్లు సిఫారసు చేయడం సహజమేనని.. అదే క్రమంలో తానూ సిఫారసు చేసినట్లు తెలిపారు. అయితే తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని విలేకరులతో అన్నారు. మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసుకు సంబంధించి ఆయన బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు.
మద్యం రవాణా కేసులో నిందితుడైన వాసుదేవరెడ్డితో ఆయనకు ఉన్న సంబంధాలు, కలిగిన ఆర్ధిక ప్రయోజనాల గురించి ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కోణంలో విచారించినట్లు సమాచారం. అంబటి అనుచరులైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలకు లిక్కర్ రవాణా సబ్ కాంట్రాక్టులను వాసుదేవరెడ్డి ద్వారా ఇప్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సబ్ కాంట్రాక్టుల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీల గురించీ ఆరా తీసినట్లు సమాచారం. విచారణ అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు పూర్తిగా సహకరించానన్నారు. అన్ని వివరాలూ తెలియజేశానని చెప్పారు. ఈడీ అధికారులు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.