ప్రకాశం : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఏకపక్షంగా కూటమి పార్టీలకు ఓటు వేస్తున్నారని తెలిపారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బలవంతంగా పార్టీ నాయకులను ఎన్నికల్లో నిలబెట్టారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయామని వైసీపీ అభ్యర్థులు చెబుతున్నారన్నారు. ప్రజల తీర్పు చూసి గొడ్డలి పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి హితవుపలికారు.ఏపీ వ్యాప్తంగా28 జెడ్పీలో 582 జడ్పీటీసీ స్థానాలకు, 659 ఎంపీపీల్లో 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జడ్పీటీసీ స్థానాల్లో 2,169 మంది పోటీలో ఉండగా, ఎంపీటీసీ స్థానాల్లో 18,843 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.