Global Vaartha
Date of Publish : 05/11/2026, 10:38 am
Editor : భవ్య జర్నలిస్ట్

1,741 మందికి ఇందిరమ్మ ఇళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఇందిరమ్మ ఇళ్ల టవర్ల పైలట్‌ ప్రాజెక్టులో ఎంపికై వెయిటింగ్‌ లిస్టులో ఉన్న 1,741 మందికి ఈ-లాటరీలో బుధవారం ఇళ్లను కేటాయించారు. క్యూర్‌ ప్రాంతంలోని అల్పాదాయ వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో 480 ఇళ్లను నిర్మిస్తున్నారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ ద్వారా ప్రభుత్వం ఇళ్లను కేటాయించింది.క్షేత్రస్థాయిలో పరిశీలనలో అనర్హులుగా తేలడం, కొంతమంది తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేటాయింపును రద్దు చేసుకోవడం వంటి కారణాలతో 14 నియోజకవర్గాల పరిధిలో 1,741 ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. నాంపల్లి హౌసింగ్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మాప్‌-అప్‌ ఈ లాటరీలో ఆ ఇళ్లను వెయిటింగ్‌ లిస్టులో ఉన్న వారికి కేటాయించారు. లాటరీ ప్రక్రియలో హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ విపి గౌతం, కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఖైరతాబాద్‌లో 327..

ఈ లాటరీ ప్రక్రియలో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 327 మంది, మహేశ్వరం నియోజకవర్గంలో 201 మంది ఇళ్లను పొందారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 80, మల్కాజిగిరిలో 150, కూకట్‌పల్లిలో 59, సనత్‌నగర్‌లో 88, కంటోన్మెంట్‌లో 66, బహదూర్‌పురాలో 91, కార్వాన్‌లో 73, మేడ్చల్‌లో 143, నాంపల్లిలో 106, మలక్‌పేటలో 171, రాజేంద్రనగర్‌లో 133, అంబర్‌పేటలో 53 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఏర్పడిన ఖాళీలకు అదనంగా మరో 875 మందిని వెయిటింగ్‌ లిస్టు కోసం ఈ-లాటరీ ద్వారా ఎంపిక చేశారు. లాటరీలో ఎంపికైన వారి వివరాలు నిర్ధారించుకునేందుకు త్వరలోనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save