Global Vaartha
Date of Publish : 05/11/2026, 10:57 am
Editor : భవ్య జర్నలిస్ట్

స్కూళ్ల ఏర్పాటుకు నిబంధనల సడలింపు

  • పలు అంశాల్లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు చాలు
  • పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

అమరావతి : నూతన పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. ప్రస్తుతం ఉన్న కొన్ని కఠిన నిబంధనలను తొలగించింది. ఈ మేరకు ఏపీ విద్యా సంస్థల రూల్స్‌కు పలు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సవరణల ప్రకారం ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఏర్పాటుకు డీఈవో, సెకండరీ పాఠశాలలకు ఆర్జేడీలు అనుమతులు ఇస్తారు. పారిశుధ్య ధ్రువీకరణ పత్రానికి బదులుగా స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చు. ట్రాఫిక్‌, మున్సిపల్‌ లేదా గ్రామ పంచాయతీ నుంచి పొందాల్సిన ఎన్‌వోసీ స్థానంలోనూ స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వొచ్చు. తప్పుడు పత్రాలు సమర్పిస్తే రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు జరిమానా విధిస్తారు.

అయితే అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. నిర్మాణ స్వరూప పత్రం, ఆక్యుపెన్సీ పత్రం, అగ్నిమాపక భద్రత పత్రం తప్పనిసరిగా ఉండాలి. విద్యా సంవత్సరంలో అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 50వేల ఫైన్‌తో డిసెంబరు 31 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. మూడు నెలల్లో అనుమతులు మంజూరు చేస్తారు. అనుమతి నిరాకరిస్తే కారణాలను ఉత్తర్వుల్లో వెల్లడిస్తారు. సింగిల్‌ విండో పోర్టల్‌ ద్వారా పాఠశాలలకు గుర్తింపు ఇస్తారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save