అమరావతి : రాప్తాడు ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. బాధితురాలికి వైద్యులు అందిస్తున్న చికిత్స సత్ఫలితాలను ఇస్తోందని, ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.ముఖ్యంగా బాలిక కుడి భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడం ఉపశమనం కలిగించే విషయమని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితురాలు మంచం నుంచి లేచి కుర్చీలో కూర్చునే స్థితికి వచ్చిందని.. నిలబడేందుకు, నడిచేందుకూ ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు క్రమంగా కోలుకుంటుండటంతో కుటుంబ సభ్యుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి.సాధారణ స్థితిలో శ్వాస, రక్త ప్రసరణ..
ప్రస్తుతం బాధితురాలు శ్వాసక్రియ, రక్త ప్రసరణ సాధారణ స్థితిలోనే ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. మరోవైపు బాధితురాలు నోటి ద్వారా ఆహారం తీసుకోవడం కూడా ప్రారంభించారని తెలిపారు. ఇది ఆమె కోలుకునే ప్రక్రియలో సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఐవీ (IV) ద్వారా అవసరమైన మందులు అందించడంతోపాటు నొప్పి నివారణ చికిత్సను కూడా వైద్యులు కొనసాగిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ.. మరింత త్వరగా కోలుకునేందుకు వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. వైద్యుల సూచనలు, పర్యవేక్షణ మధ్య చికిత్స కొనసాగుతుండగా.. బాధితురాలు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.