ఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (Special Summary Revision - SSR)కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2027 జనవరి 1ని అర్హత తేదీగా నిర్ణయించింది. ఈసీఐ ఆదేశాల మేరకు అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ, మిజోరం, ఒడిశా, సిక్కింలో అధికారులు ఎస్ఎస్ఆర్ నిర్వహించనున్నారు.
2026 నవంబర్ 20లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయాలని ఈసీఐ ఆదేశించింది. 2026 నవంబర్ 30న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 30 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. 2027 జనవరి 16లోగా అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. 2027 జనవరి 21న తుది ఓటరు జాబితా (Final Electoral Roll)ను ప్రచురించనున్నట్లు తెలిపింది.
కొత్త ఓటర్లకు అవకాశం..
మరోవైపు, కొత్త ఓటర్ల నమోదుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 2027 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యువత ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఈసీఐ తెలిపింది. 2027 ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యువత కూడా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఓటరు జాబితాలో పేరు చేర్చేందుకు ఫారం-6, విదేశాల్లో నివసించే భారతీయ ఓటర్లు ఫారం-6A ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఓటరు జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం-7, చిరునామా మార్పు, వివరాల సవరణ, EPIC మార్పు కోసం ఫారం-8ను వినియోగించాలని వెల్లడించింది.
అధికారులకు ఈసీఐ ముఖ్యమైన మార్గదర్శకాలు
ఆధార్ నంబర్ ఇవ్వడం ఐచ్ఛికం. ఆధార్ ఇవ్వలేదనే కారణంతో ఓటరు నమోదు దరఖాస్తును తిరస్కరించకూడదు. ఇప్పటికే ఉన్న పేర్లను తొలగించకూడదు.
ఒకే ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులందరి పేర్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రం, ఒకే విభాగంలో ఉండేలా చూడాలి.
ఒక పోలింగ్ కేంద్రంలో సాధారణంగా 1,200 మందికి మించి ఓటర్లు ఉండకూడదు.
ఓటరు జాబితాలోని డూప్లికేట్ పేర్లు, మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలి.
పేర్ల తొలగింపునకు ముందు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి, అవసరమైన నోటీసులు జారీ చేయాలి. సంబంధిత వ్యక్తికి తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలి.
ఒక పోలింగ్ కేంద్రంలోని మొత్తం ఓటర్లలో 2 శాతానికి మించి పేర్ల తొలగింపులను ప్రతిపాదించినా, ఒకే వ్యక్తి ఐదుకంటే ఎక్కువ అభ్యంతరాలు దాఖలు చేసినా ERO స్వయంగా వాటిని పరిశీలించాలి.
రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) నియమించుకోవచ్చు.
BLAలు రోజుకు గరిష్ఠంగా 10 ఫారాలను (ఫారం-6/7/8) బూత్ లెవల్ ఆఫీసర్లకు (BLO) సమర్పించవచ్చు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ సహా మరో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ కొనసాగుతోందని, ఆయా ప్రాంతాల్లో ఎస్ఎస్ఆర్ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నట్లు ఈసీఐ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లోని వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఓటరు జాబితాల సవరణ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.