Global Vaartha
Date of Publish : 05/11/2026, 4:10 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం..

కేరళం : దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఓ మహిళ అడ్డంగా బుక్కైంది. బంగారాన్ని అప్పగించాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా తానే కాజేయాలని ఆమె వేసిన కిడ్నాప్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాదాపు 12 కిలోమీటర్ల పాటు సినిమా రేంజ్ ఛేజింగ్‌ చేసిన పోలీసులు.. నిందితురాలితో పాటు పలువురిని అరెస్టు చేశారు. అయితే, మహిళ వేసిన ప్లాన్ చూసి పోలీసులే కంగుతిన్నారు. వెంటనే అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటన కేరళంలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకుంది.తలస్సేరికి చెందిన ప్రియాంక అనే మహిళ దుబాయ్ నుంచి సుమారు 18 సవర్ల బంగారంతో కేరళంలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ బంగారాన్ని విమానాశ్రయం బయట వేచి ఉన్న మట్టన్నూర్‌కు చెందిన జబీర్ అనే వ్యక్తికి అప్పగించాల్సి ఉంది. అయితే, బంగారాన్ని అతనికి ఇవ్వకుండా తానే కాజేయాలని ప్రియాంక ప్లాన్ వేసింది. ఈ మేరకు కన్నూర్‌కు చెందిన శ్రీలాల్, ప్రిన్స్, సుభిత్ అనే ముగ్గురితో చేతులు కలిపింది. జబీర్‌కు బంగారాన్ని ఇవ్వడానికి ముందే తనను ఎవరో కిడ్నాప్ చేసినట్లు నాటకానికి తెరతీసింది నిందితురాలు.

ఇందులో భాగంగా ప్రియాంకను తీసుకెళ్లేందుకు శ్రీలాల్ ఓ కారుతో విమానాశ్రయానికి వచ్చాడు. ఈ సందర్భంగా కిడ్నాప్ పథకాన్ని అమలు చేశారు. ప్రియాంకను ఎవరో తీసుకెళ్తున్నట్లు గుర్తించిన జబీర్ ఆ కారు వెంబడి పరిగెత్తాడు. ఇది కరిపూర్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ అధికారి గమనించారు. కిడ్నాప్ జరుగుతోందని అనుమానించిన ఆయన వెంటనే పోలీసు వాహనంతో కారును వెంబడించారు. దాదాపు 12 కిలోమీటర్ల పాటు ఛేజ్ చేసి కారును నిలువరించారు. అందులో ఉన్నవారిని సురక్షితంగా కాపాడారు.

అయితే, ప్రియాంక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. అక్రమ బంగారాన్ని కాజేసేందుకు తానే ప్లాన్ వేసినట్లు ప్రియాంక అంగీకరించింది. దీంతో ప్రియాంక, ఆమెకు సహకరించిన ముగ్గురు సహా జబీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, ఈ కుట్రతో ప్రియాంక భర్తకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. భర్త, పిల్లలను తీసుకురావడం ద్వారా కిడ్నాప్ వ్యవహారం సహజంగా కనిపించేలా ప్రియాంక ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ బంగారం స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, కస్టమ్స్ సిబ్బందికి ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save