Global Vaartha
Date of Publish : 05/11/2026, 4:16 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలపై కేంద్రం హామీ.. తుమ్మలకు ప్రల్హాద్ జోషి లేఖ

హైదరాబాద్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి లేఖ రాశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలపై తెలంగాణ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని గతంలో మంత్రి తుమ్మల కోరిన విషయం తెలిసిందే. గతంలో 44 శాతంగా ఉన్న దిగుమతి సుంకం ప్రస్తుతం 11 శాతానికి తగ్గింది. దిగుమతి సుంకం తగ్గింపుతో దేశీయ ఆయిల్ పామ్ రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, చౌక దిగుమతులతో దేశీయ రైతులకు గిట్టుబాటు ధర దక్కదని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులకు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తులు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి.. మంత్రి తుమ్మలకు లేఖ రాశారు. దేశీయ వంటనూనెల అవసరాల్లో 56 శాతం దిగుమతులపైనే భారత్ ఆధారపడుతోందని తెలిపారు. రైతులు, పరిశ్రమలు, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సుంకాల సమీక్ష చేస్తామన్నారు. దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save