ఏపీకి మురసు తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

అమరావతి : మురసు తుఫాన్ ప్రభావంతో రానున్న 3 గంటలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరుగా వానలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సూచించారు. పొంగుతున్న వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదలపై లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.దక్షిణ కోస్తాంధ్రపై మురసు తీవ్ర తుఫాన్ ముప్పు ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతోందని తెలిపారు. బాపట్లకు 40 కిలోమీటర్లు, ఒంగోలుకు 50 కిలోమీటర్లు, విజయవాడకు 90 కిలోమీటర్లు, కావలికి 110 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని చెప్పారు. మురసు తుఫాన్ క్రమంగా తీవ్రవాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ రాత్రి నుంచి ఈదురుగాలులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మురసు తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












