05/11/2026, Thursday · 07:56:32 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రంపాలు మొలుస్తాయి ... మహమ్మద్ ఖదీర్ బాబు

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 11:19 AM జాతీయం 14

రంపాలు మొలుస్తాయి ... మహమ్మద్ ఖదీర్ బాబు
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటి పిల్లాడు చాక్లెట్‌ కొనివ్వలేదనో, ట్యూషన్‌కు వెళ్లననో కాళ్లు నేల మీద గట్టిగట్టిగా తాటిస్తాడు. అప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ దగ్గరకు తీసుకుని ‘అలా నేల మీద కాళ్లు రుద్దకు నాయనా. భూదేవికి నొప్పి పుట్టి ఏడుస్తుంది’ అని చెప్పేది. ఆ తర్వాత ఆ పిల్లాడు నేల మీద గట్టిగా నడవడానికి కూడా జంకేవాడు.

తూనీగకు దారం కట్టి ఆడుతూ ఉంటే ‘పాపంరా... అలా చేయకు’ అని తల్లి కచ్చితంగా కోప్పడేది. ‘చీమల దారికి అడ్డంగా నీళ్ళు పోస్తారా ఎవరైనా... అవి ఇల్లు కట్టుకుంటున్నాయిరా’ అని అదిలించేవారు ఇంట్లో కచ్చితం ఉండేవారు. ‘చెట్టు మీద రాయి విసరకు. చెట్టుకు దెబ్బ తగులుతుంది’ అని గదమాయించే పెద్దలు ఇటూ అటూ సిద్ధం. ఇవన్నీ కేవలం పెద్దల మాటలు కాదు. పిల్లల గుండెలోకి కరుణను ఎక్కించే సూది మందులు. పిల్లాడి మణికట్టుపై కట్టే దయాదారాలు.

తోటి ప్రాణి నొప్పిని తన నొప్పిగా భావించడం నేర్పే మొదటి బడి ఇల్లే.

పిల్లాడు పెద్దయి బడికి వెళ్తే అక్కడ మరో తల్లి ఎదురయ్యేది.. టీచర్‌. ఆమె అక్షరాలతో పాటు కరుణను కూడా దిద్దించేది. అందరి వేళ్లూ తెగ నరికే అంగుళీమాలుడిని చూసి బుద్ధుడు ‘నేను ఆగిపోయాను.... నీవే ఆగాలి’ అని ఎలా ఆపాడో చెప్పేది. ‘నేను అన్ని ప్రాణులను హింసించడం ఆపేశాను. కరుణలో స్థిరంగా ఆగిపోయాను. కానీ నీవు ఇంకా హింసలో పరిగెడుతూనే ఉన్నావు’ అన్న బుద్ధుడి మాటల్లో కారుణ్యం క్లాస్‌రూమ్‌లో పిల్లల మనసులను తాకేది.

గాంధీ తాత పరుగెత్తే గుర్రపు బగ్గీ కింద పడ్డ కుక్కపిల్ల కోసం పరీక్ష మానుకున్నారని చెప్తే మరువగలమా ఆ పాఠాన్ని? పిల్లల్లో ఇల్లు కరుణను నాటితే బడి దానికి నీళ్ళు పోసేది. ఆ తర్వాత సమాజం ఆ మొక్కను ఎదగనిచ్చేది.

ఊళ్లో పెద్దల మాట అంటే హడల్‌. ఎవరు ఎవరి మీదైనా హింస చేస్తే పెద్దలు వాళ్లను పట్టుకొచ్చి రచ్చబండ దగ్గర రేవు పెట్టేవారు. అంటే మనం ఎవరినైనా బాధిస్తే సంఘం దృష్టిలో చులకమవుతమనే భయం నాటుకునేది. పశువును కొట్టినా పిట్టపై గులేర్‌ రాయి ఎక్కుపెట్టినా చెవి మెలేసే పెద్దలు పెట్టిన భయం మనసులో స్థావరం చేసుకునేది. చెట్టుకింత నీరు, పక్షికి నాలుగు గింజలు, ఆకలిగొన్నవాడికి పట్టెడు అన్నం... అదే జీవితం అని సంఘం పాఠం చెప్పేది. తన బలం, తన కోపం, తన ప్రేమ ఇతరులను నొప్పించడానికి వాడకూడదని అది గట్టిగా అర్థం చేయించేది.

అదంతా గతం.

ఇప్పుడు? అమ్మమ్మలు నానమ్మలు ఇళ్లల్లో ఉండటమే లేదు. తల్లిదండ్రులకు పిల్లలతో కూర్చుని కథ చెప్పేంత సమయం లేదు. ఫోనో, టాబ్లెటో ఇచ్చి వాళ్ల పరుగుల్లో వాళ్లున్నారు. దాంతో వాడు తూనీగకు దారం కట్టడం కాదు స్క్రీన్‌ మీద డ్రాగన్‌లను నరకడం నేర్చుకుంటున్నాడు. బడిలో విలువలు చెప్పాల్సిన టీచర్‌ సిలబస్‌ పూర్తి చేయడానికి తలమునకలవుతున్నాడు. పరీక్ష మార్కులే కొలతలుగా మారిన చోట మనిషితనానికి పడే మార్కుల ఊసే లేదు.

ఇక సంఘం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీధిలో హత్య జరుగుతుంటే రీల్‌గా మార్చడంలో మజా అనుభవిస్తోంది. వీటన్నింటి ప్రతిఫలంగా సినిమాల్లో రక్తపిపాస పెరిగింది. ఓటీటీల డార్క్‌ కంటెంట్‌. హీరో ఒక అమ్మాయిని వేధిస్తే అది ప్రేమగా, ఆమె కాదంటే పట్టుదలగా, ఆమెను కొడితే మగతనంగా చూపించే సినిమాలూ, వాటిని తీసే సినిమా బృందం జవాబుదారీతనంలేని వింత మృగాలవుతున్నారు. రంపాలు, గొడ్డళ్ళు, తుపాకులు హీరోయిజం సింబల్స్‌. మనిషిని చంపడం ఎంత ఈజీయో స్క్రీన్‌ మీద చూసి చూసి, పిల్లాడి మనసులో హింస ఒక సాధారణ విషయంగా మారిపోతోంది.

అనంతపురం క్లాస్‌రూమ్‌లో రంపంతో దాడి చేసిన పిల్లాడు ఒక్కడే నేరస్తుడా? ఆ రంపాన్ని మనమే ఇచ్చాం. కరుణ నేర్పని ఇల్లు, విలువలు చెప్పని బడి, హింసను హీరోయిజం చేసిన సినిమా ఇచ్చింది. ‘వద్దు అంటే వదిలేయాలి’ అని చెప్పని సమాజం ఇచ్చింది. అందుకే అది ఒక పిల్లాడి నేరం కాదు, ఒక తరం వైఫల్యం. అంతా ముగిసిపోయింది కనుక మళ్ళీ మొదటి నుంచి మొదలు కావడమే మార్గం. అమ్మమ్మ మళ్ళీ గొంతు విప్పి దయ నేర్పాలి. టీచర్‌ మళ్ళీ బ్లాక్‌ బోర్డ్‌ మీద కరుణ రాయాలి. సంఘం తన అంతస్తును తాను పెంచుకోవాలి.

అంతవరకు ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక రంపం తిరుగుతూనే ఉంటుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

khadir baburampalumolustayimahammad

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News