సమర్ధన్ ట్రస్టు సౌజన్యంతో దివ్యాంగుల సహాయ పరికరాల వైద్యశిబిరం విజయవంతం

- స్వచ్ఛందసంస్థల సహాయపరికరాల ఏర్పాటు - దివ్యాంగుల స్వతంత్ర జీవనానికి తోడ్పాటు.
- బెంగుళూరు సమర్థన్ ట్రస్ట్ హెల్త్ డైరెక్టర్ లోకేష్
గ్రామీణ ప్రాంతాలలో దివ్యాంగులు నేటికీ సరైన వైద్యసదుపాయం, సహాయ ఉపకరణాలు, హెల్త్ థెరపీలు, కృత్రిమఅవయవాలు లభించక ఇళ్ళకే పరిమితమవుతున్నార ని, అటువంటి వారిని గుర్తించి, వెనుకబడ్డ రాయలసీమలోని మారుమూల ప్రాంతాలలో వైద్య, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేసి, అంగవైకల్యం గల వారికి కావలసిన వైద్యసహాయం, సహాయపరికరాలు అందించి, వారిని కూడా జనజీవన స్రవంతిలోనికి తీసుకురావడమే సమర్థన్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని, అంధుడైన తమ సంస్థ ఫౌండర్ మహంతీశన్ స్ఫూర్తితోనే తాము గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, అర్హులుగా గుర్తించిన దివ్యాంగులకు తమ ప్రాజెక్టు ద్వారా అవసరమైన ఉపకరణాలను, వైద్యసహాయాన్ని ఉచితంగా, త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తున్నామని బెంగళూరుకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సమర్ధన్ ట్రస్ట్ వైద్య విభాగం డైరెక్టర్ లోకేష్ పేర్కొన్నారు.
స్థానిక ముద్దనూరు రోడ్డులోని వికలాంగుల కమ్యూనిటీ భవనంలో సమర్ధన్ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య స్క్రీనింగ్ శిబిరంలో, మొదట దివ్యాంగుల స్ఫూర్తిప్రదాతలు లూయి బ్రెయిలీ, హెలెన్ కెల్లర్ చిత్రపటాలకు పూలమాలవేసి ఘననివాళి అర్పించారు. తదినంతరం జరిగిన మెడికల్ క్యాంపులో ప్రత్యేక పునరావాస నిపుణులు పాల్గొని సహాయపరికరాలు, వైద్య సదుపాయం అవసరమైన దివ్యాంగులను గుర్తించి పేర్లు నమోదు చేయడం జరిగింది.
అర్హులైన దివ్యాంగులకు త్వరలో సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వారికి చేయూతనందిస్తామని నిర్వాహకులు తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని వివిధ మండలాల దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరై వైద్య పరీక్షలు పొందారు.
ఈకార్యక్రమంలో బెంగుళూరు సమర్ధన్ ట్రస్ట్ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు లోకేష్, పవిత్ర, వికలాంగుల నెట్ వర్క్ రాష్ట్ర అధ్యక్షులు డా. ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రం టీచర్లు సిస్టర్ కీర్తి, ఎస్తేరు, సుమిత్ర, వికలాంగుల సంఘ కార్యవర్గ సభ్యులు చిన్న రామకోటి, శివాజీ, మహమ్మద్ రఫీ, షఫీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













