05/11/2026, Thursday · 08:34:20 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంపై దాడి.. వాహనాల దగ్ధం దాడికి గురైన వారిపైనే కేసులా?

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 6:02 PM అన్నమయ్య 6

రాయచోటి వైఎస్ఆర్ సిపి  కార్యాలయంపై దాడి.. వాహనాల దగ్ధం దాడికి గురైన వారిపైనే కేసులా?
Want this news as a newspaper clip?Print News Clip

రాయచోటిలోని వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం పై దాడి చేసి, పార్టీ నాయకులకు చెందిన వాహనాలను దగ్ధం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి తమ పార్టీకి చెందిన సుమారు 150 మందిపై రివర్స్ కేసులు పెట్టారని, మరో కేసులో సుమారు 300 మందిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. రోజుకు వందలాది మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులకు గ్రామాలకు వెళ్లి నోటీసులు అందిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు.ఈ ఘటనలో వాస్తవాలను వెలికితీసి, బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాడికి గురైనవారిపైనే కేసులు పెట్టడం ద్వారా న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. చట్టాన్ని అమలు చేసే అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా వాస్తవాల ఆధారంగా వ్యవహరించాలని కోరారు. కార్యాలయంపై దాడి, వాహనాల దగ్ధం వంటి ఘటనలు రాయచోటి పట్టణ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, రాజకీయ విభేదాలు ఉన్నా పార్టీ కార్యాలయాలు, ప్రజల ఆస్తులు, కార్యకర్తల భద్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.
జిన్నా షరీఫ్‌ను జైలులో పరామర్శించా
     కడప కేంద్ర కారాగారంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్‌ను పరామర్శించినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.రాజకీయంగా పోటీకి వస్తున్నారనే ఉద్దేశంతోనే ఆయనపై కేసులు పెట్టారని, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. చదువుకుంటున్న జిన్నా షరీఫ్ పిల్లలపైనా కేసులు బనాయించడం బాధాకరమని అన్నారు. జిన్నా షరీఫ్‌కు సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ, లీగల్ ఆయుధాల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయుధాల పేరుతో హత్యాయత్నానికి సంబంధించిన ఆరోపణలు చేయడం, అనంతరం కార్లలో గంజాయి పెట్టి కేసులు నమోదు చేయాలని ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరగాలని, ఆరోపణలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్థులను కేసుల ద్వారా అణచివేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రాయచోటి జిల్లా కేంద్రం నుంచి నామినేషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది
        2024 ఎన్నికల సమయంలో జిల్లా అంతటా రాయచోటికి వచ్చి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారని, అప్పట్లో రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండటం గర్వకారణంగా భావించానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటికి జిల్లా కేంద్రం హోదా రావడం వల్ల అభివృద్ధి, పరిపాలన, వ్యాపార కార్యకలాపాలకు ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు.అయితే ఇప్పుడు జెడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేయడానికి కూడా అభ్యర్థులు పక్క ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు జిల్లా పరిపాలనకు కేంద్రంగా నిలిచిన పట్టణం, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు.జిల్లా కేంద్రం మార్పుతో పాటు వ్యాపారాలు, పట్టణాభివృద్ధి, ప్రజల ఉపాధిపై ప్రభావం పడుతోందని, దీనికి తోడు రాజకీయ హింస ఆరోపణలు రాయచోటి ప్రతిష్ఠను మరింత దెబ్బతీస్తున్నాయని అన్నారు. గత 18 ఏళ్లలో రాయచోటిలో నెలకొన్న పరిస్థితులు, గత రెండు మూడు సంవత్సరాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర నివేదిక తెప్పించుకొని వాస్తవాలను పరిశీలించాలని సూచించారు.రాయచోటి సంస్కృతిపై మాట్లాడే ముందు ఇక్కడి చరిత్ర, ప్రజల మధ్య ఉన్న సామరస్యం, గతంలో కొనసాగిన ప్రశాంత వాతావరణం గురించి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సూచించారు. రౌడీయిజం చేస్తున్నవారే ఇతరులపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
                                     పౌర హక్కులు,ప్రజా సంఘాలు, మీడియా, మేధావులు స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితులు రాయచోటిలో ఏర్పడ్డాయి
         రాయచోటిలో రాజకీయ పరిస్థితులు దిగజారుతున్నాయని, పౌర హక్కుల సంఘాలు,ప్రజా సంఘాలు, మేధావులు, మీడియా సైతం స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ, పౌర హక్కుల పరిరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.తాను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, క్యాబినెట్ హోదాలో కూడా పనిచేశానని, తనపై విమర్శలు, ట్రోలింగ్ జరిగినా వాటిని పట్టించుకోకుండా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టానని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు వేసేవారిని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.కూటమి పాలనలో బయటి రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు సైతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నిస్తుంటే, వారిపై కేసులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉండాలని, వాటిని అణచివేయడం సరికాదని స్పష్టం చేశారు.
అధికారులారా.. పదవులు శాశ్వతం కావు! ప్రభుత్వ అధికారులు తమ బాధ్యతలను గుర్తుంచుకొని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగంలో చేరే సమయంలో చేసిన ప్రమాణాలను గుర్తు చేసుకోవాలని, చట్టబద్ధంగా పనిచేయాల్సిన బాధ్యతను విస్మరించవద్దని అన్నారు. పోస్టింగ్‌లు, పదవులు, ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయ ఒత్తిళ్లకు లొంగి చట్టవిరుద్ధ చర్యలకు సహకరిస్తే భవిష్యత్తులో సమాజం ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పదవులు శాశ్వతం కావని, ప్రజల మనసులు గెలుచుకోవడం, న్యాయం చేయడం, భవిష్యత్తు తరాలకు మంచి వ్యవస్థలను అందించడం అధికారుల నిజమైన బాధ్యతని పేర్కొన్నారు.కొంతమంది రౌడీ మూకల కోసం, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల గౌరవాన్ని దెబ్బతీయడం తగదన్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్న సూత్రాన్ని అమలు చేయాలని, ఎన్నికల సంఘం, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాలని కోరారు.
రాయచోటికి జరిగిన నష్టాన్ని పూడ్చి.. మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతా
  గత మూడు సంవత్సరాల్లో రాయచోటి అభివృద్ధికి, పట్టణ ప్రతిష్ఠకు నష్టం జరిగిందన్నారు. ఈ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, ప్రజల మనోభావాలను గౌరవించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.రాయచోటి ప్రాంత ప్రజల ప్రేమ, ప్రాంత శ్రేయస్సు తనకు ముఖ్యమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని చెప్పారు. గతంలో పట్టణం ఎలా ప్రశాంతంగా, అభివృద్ధి దిశగా ముందుకు సాగిందో, అంతకంటే మెరుగైన పరిస్థితులు తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు శాంతియుత పోరాటం
        దేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను గుర్తుచేస్తూ, అన్యాయాన్ని ఎదిరించేందుకు గతంలో ప్రజలు శాంతియుత పోరాటాలునిర్వహించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలందరూ కలిసికట్టుగా నిలబడాలని పిలుపునిచ్చారు.రౌడీయిజం, బెదిరింపులు, దాడుల ద్వారా ప్రజల గొంతును నొక్కివేయాలని ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడటం, స్వేచ్ఛాయుత ఎన్నికలకు కృషి చేయడం, అన్యాయానికి గురైనవారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకొని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగి, వారి తీర్పును స్వీకరించాలని కోరారు. లేకుంటే ఇటువంటి పరిణామాలు చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోతాయని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకునేవారికి ప్రజలే సమాధానం చెబుతారు. రాయచోటి ప్రజల హక్కులు, ప్రాంత శ్రేయస్సు, పట్టణ ప్రతిష్ఠను కాపాడేందుకు నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తా. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగే వరకు, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడే వరకు నా వంతు పోరాటం కొనసాగిస్తా అని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

office attackedRAYACHOTYYSRCP

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News