05/11/2026, Thursday · 07:22:07 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చిన్నారుల్లో నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం.. 17 కోట్ల మందికి పైగా బాధ!

భవ్య జర్నలిస్ట్ 16/10/2026 8:08 PM ఆరోగ్యం 19

చిన్నారుల్లో నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం.. 17 కోట్ల మందికి పైగా బాధ!
Want this news as a newspaper clip?Print News Clip
  • పిల్లలు, టీనేజర్ల ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
  • 1990లో 2 శాతంగా ఉన్న ఊబకాయం.. 2024 నాటికి 8 శాతానికి
  • ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులే కీలకం
  • చిన్నారుల వయసును బట్టి చికిత్స ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచన

ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో ఊబకాయం సమస్య తీవ్రమవుతోంది. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తొలిసారిగా ప్రత్యేక అంతర్జాతీయ మార్గదర్శకాలను విడుదల చేసింది. 2024 గణాంకాల ప్రకారం, 5 నుంచి 19 ఏళ్ల వయసున్న దాదాపు 17 కోట్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో 5–9 ఏళ్ల మధ్య వయసున్నవారు సుమారు 7 కోట్లు కాగా, 10–19 ఏళ్ల వయసున్నవారు 10 కోట్ల మంది ఉన్నారు. 1990లో ఈ వయసు వర్గాల్లో ఊబకాయం ప్రాబల్యం 2 శాతంగా ఉండగా, 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగి 8 శాతానికి చేరింది. ఐదేళ్లలోపు మరో 3.5 కోట్ల మంది చిన్నారులు అధిక బరువుతో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ సమస్యను తగ్గించేందుకు పిల్లల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, రోజువారీ జీవనశైలిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం వంటి అంశాలతో కూడిన కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపింది. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు, సంరక్షకులను కూడా భాగస్వాములను చేయాలని పేర్కొంది. ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు డిజిటల్ హెల్త్ సాధనాలను తగిన జాగ్రత్తలతో ఉపయోగించవచ్చని వివరించింది. ముఖ్యంగా 0–9 ఏళ్ల పిల్లలకు బరువు తగ్గించే మందులు, బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు లేదా ప్రత్యేక పరికరాలను సాధారణ చికిత్సగా ఉపయోగించడంపై సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్లల పెరుగుదల, దీర్ఘకాలిక భద్రతకు సంబంధించి తగిన శాస్త్రీయ ఆధారాలు అవసరమని స్పష్టం చేసింది.

10–19 ఏళ్ల కౌమారదశ పిల్లల్లో జీవనశైలి మార్పులతో ఆశించిన ఫలితాలు రానప్పుడు, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆమోదిత మందులను పరిగణనలోకి తీసుకోవచ్చని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. తీవ్రమైన ఊబకాయం ఉన్న కొందరిలో కఠినమైన వైద్య ప్రమాణాలకు అనుగుణంగా శస్త్రచికిత్సను పరిశీలించవచ్చని తెలిపాయి. డబ్ల్యూహెచ్‌ఓ పోషకాహారం, ఆహార భద్రత విభాగం డైరెక్టర్ డాక్టర్ లజ్ మారియా డి రెగిల్ ప్రకారం, మందులు లేదా శస్త్రచికిత్సలకంటే ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ప్రోత్సహించే సమగ్ర సహకారమే చికిత్సకు పునాది. ఊబకాయంతో ఉన్న పిల్లలను అవమానించడం, వివక్ష చూపడం కాకుండా వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడాలని సంస్థ సూచించింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

More thancrorechildrensufferfourfoldincreaseobesity

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News