పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ సందడి.

గ్లోబల్ వార్త- కర్నూలు :
గ్రామీణ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి కనిపించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న నేతలు ఓటు వేయడంతో మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రాజకీయ సందడి నెలకొంది. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాఘవేంద్రరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అదే విధంగా మంత్రాలయం ఎంపీపీ అభ్యర్థి శారదమ్మ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన స్వగ్రామమైన రాంపురంలో ఓటు వేశారు. కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలాల్లోనూ జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి తనయుడు దినేష్ ఆలూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు స్వయంగా పోలింగ్‌లో పాల్గొనడంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల సందడి మరింత పెరిగింది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












