టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్.. సుధా రెడ్డి ఇదేం తీరు?

చంద్రగిరి: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, సుధారెడ్డిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం తీరని ప్రశ్నిస్తున్నారు.చంద్రగిరిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో సుధారెడ్డి కూడా ఆయన వాహనాన్ని అనుసరిస్తూ అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన ఎక్కడికి వెళ్తే సుధారెడ్డి అటే వెళ్లడం గమనార్హం.చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరగాల్సిన సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్యటనలపై సుధారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే తాము కూడా వెళ్తామని స్పష్టం చేస్తూ హడావుడి చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కారును సుధారెడ్డి తన వాహనంతో వెంబడించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ‘నేను ఎస్కార్ట్.. చెవిరెడ్డి వెంటే ఉంటా.. ఆయన ఎక్కడికి వెళ్తే మా వాహనం కూడా అక్కడికే వెళ్తుంది’ అంటూ ఆమె కామెంట్స్ చేస్తూ చెవిరెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సహనం పాటించిన చెవిరెడ్డి
పోలింగ్ కేంద్రాల వద్ద పర్యటిస్తున్న సమయంలో ఎదురైన ఈ పరిణామాలపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంయమనం పాటించారు. ప్రత్యర్థి వర్గం నుంచి ఎదురైన సవాళ్లకు స్పందించకుండా తన పర్యటన కొనసాగించారు. మొత్తంగా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ నాయకులు, వారి అనుచరులు సంయమనం పాటించి ప్రశాంత పోలింగ్‌కు సహకరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












