ఆర్నబ్ తుఫాను ప్రభావం.. చెన్నైలో రోడ్లపైకి ఎగసిపడుతున్న అలలు

తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అర్నాబ్ తుఫాను ప్రభావంతో చెన్నై పరిసర ప్రాంతాల్లో అలల తీవ్రత పెరగడంతో తీరప్రాంత ప్రజలు.. వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నూరు, తిరువొత్తియూరు ప్రాంతాల్లో భారీ అలలు తీరాన్ని దాటి రహదారులపైకి దూసుకొచ్చాయి. పట్టినంబాక్కం, మహాబలిపురం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఎన్నూరు వద్ద సముద్రపు నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి.పరిస్థితిని గమనించిన పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. రామకృష్ణ నగర్ నుంచి అన్నై శివగామి నగర్‌కు వెళ్లేవారికి ఎర్నావూర్ వంతెన, మురుగర్ కోవిల్ రోడ్డు, కతివక్కం బీచ్ మీదుగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అలల ఉద్ధృతి నేపథ్యంలో ఉత్తర చెన్నైలోని ఓ తీర రహదారిని అధికారులు మూసివేశారు. సముద్ర పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర తీర ప్రాంతాల్లో అలలు బలంగా విరుచుకుపడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) సూచించడంతో రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (SEOC) ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. నాలుగు తీర జిల్లాలతో పాటు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












