తుఫాన్ వేళ వైద్యసేవల్లో అంతరాయం ఉండకూడదు: మంత్రి సత్యకుమార్

అర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వైద్యశాఖ అధికారులను ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అప్రమత్తం చేశారు. తుఫాన్ వేళ వైద్యసేవల్లో అంతరాయం ఉండకూడదని ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరంతర, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. గర్భిణులు, నవజాత శిశువులు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అక్టోబరు 23వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య ప్రసవ తేదీ ఉన్న 26,768 మంది గర్భిణుల తరలింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రోగుల తరలింపులో ఆలస్యం చేయొద్దు..
వరద ముప్పు ప్రాంతాల్లోని గర్భిణులు, హై రిస్క్ గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించాలని మంత్రి సూచించారు. ఆస్పత్రుల్లో మందులు, ఆక్సిజన్, జనరేటర్లు, అత్యవసర పరికరాలు సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు. 108, 104, 102 వాహన సేవలతో సమన్వయం చేసుకోవాలని.. రోగుల తరలింపులో ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. తాగునీటి భద్రత, పారిశుద్ధ్యంపై నిఘా ఉంచాలని అన్నారు. అంటువ్యాధులు, పాముకాట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ సన్నద్ధత, వైద్య సేవల నిరంతర నిర్వహణ బాధ్యత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులదేనని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












