05/11/2026, Thursday · 08:58:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

స్థానిక ఎన్నికల్లో కూటమి నేతలు ఒకే జట్టుగా పనిచేయాలి.. సీఎం చంద్రబాబు పిలుపు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 4:39 PM రాష్ట్ర వార్తలు 15

స్థానిక ఎన్నికల్లో కూటమి నేతలు ఒకే జట్టుగా పనిచేయాలి.. సీఎం చంద్రబాబు పిలుపు
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 45 వేల మంది నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుపరిపాలన నినాదంతో మూడు పార్టీలు కలిసి 2024లో ఎన్నికలకు వెళ్లామని.. ప్రజలు విశ్వసించి ఎన్డీఏకు చరిత్రాత్మక విజయాన్ని అందించారని తెలిపారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగానే పాలన అందిస్తున్నామన్నారు. చెప్పినట్లుగానే సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు. 3 పార్టీల కార్యకర్తలు సార్వత్రిక ఎన్నికల్లో ఒకే మాట-ఒకే బాట అన్నట్టుగా పని చేశారని చెప్పుకొచ్చారు.

వారికీ అవకాశం ఇస్తాం...

ఎన్నికల సమయంలో ఒక పార్టీలోనే అనేక ఇబ్బందులు ఉంటాయని సీఎం అన్నారు. ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు ఉన్నప్పుడు సమస్యలు కూడా ఉంటాయని.. అయితే రాష్ట్రం కోసం ఆ చిన్నచిన్న సమస్యలను అధిగమించాలని నేతలకు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా కలిసి పని చేశారో... అదే విధంగా స్థానిక ఎన్నికల్లోనూ 3 పార్టీలు ఒకే జట్టు అన్నట్టు ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ అధినేతలంతా కూర్చొని సీట్లపై క్లారిటీ ఇచ్చామని... దానికి తగ్గట్టుగా కూటమి కార్యకర్తలు పని చేయాలని తెలిపారు. ఇప్పుడు సీట్లు రాని వారికి నామినేటెడ్ పదవులు, ఛైర్మన్ పదవుల ద్వారా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థులకే మద్దతు తెలిపాలని... వారి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెబల్స్, స్వతంత్రులుగా పోటీలో ఉండటానికి వీల్లేదని... ఇది కూటమి ధర్మానికి విరుద్ధమన్నారు.

కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి..

స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ 62 పిటిషన్లు వేసి సుప్రీంకోర్టు వరకూ వెళ్లిందని ముఖ్యమంత్రి విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలను వాయిదా వేయడానికి అంగీకరించలేదన్నారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై గట్టిగా ఉందని.. రాష్ట్రంలోని తుఫాన్ పరిస్థితిని కేంద్రమంత్రి అమిత్ షాకు వివరించినట్లు చెప్పారు. రెండ్రోజులుగా తుఫాన్‌పై సమీక్షిస్తూనే మరోవైపు పార్టీకి సమయం కేటాయిస్తున్నామన్నారు. మూడు పార్టీల నేతలు చర్చించుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు జరిపామని అన్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉందని.. కేలండర్ ప్రకారం సంక్షేమం ఇస్తున్నామన్నారు. డీఎస్సీ నిర్వహించామని.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించామని, గుంతలు లేని రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం బటన్లు నొక్కుతున్నామంటూ అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రావాలని అన్నారు.

అదే స్ఫూర్తితో పనిచేయండి...

ఓట్ షేర్ పెరగాలని.. స్ట్రైక్ రేట్‌లో దూసుకెళ్లాలని చంద్రబాబు వెల్లడించారు. మూడు పార్టీల కార్యకర్తలు గతంలో ఎవరు అభ్యర్థి అనేది చూడకుండా ఓటువేసి గెలిపించారని గుర్తుచేశారు. మనసు పెట్టి పని చేశారని... ఇప్పుడూ అదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. గొడ్డలి పార్టీ చతికల పడిందని... బెంగళూరులో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హిట్ అండ్ రన్ మాదిరి, తీవ్రవాది తరహాలో జగన్ ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. గొడ్డలి పార్టీ అధినేత ధ్యాసంతా ప్యాలెస్‌లు, ఆస్తులపైనే ఉందని వ్యాఖ్యానించారు. ఆస్తులు కూడబెట్టుకునే పనిలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు చాలా బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అరాచకాలను, ఆకృత్యాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. వైసీపీ ఓటు బ్యాంక్ ఇప్పటికే తగ్గిపోయిందని... అది ఇంకా తగ్గుతుందన్నారు. రాష్ట్రం బాగు కోసం మరింత తగ్గాలని తెలిపారు. ‘మనం ప్రజల కోసం నిబద్ధతగా పని చేస్తున్నాం. అవతలి వారు గాలికి ఎలా తిరుగుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ బలంగా ఉండాలి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్నీ మనమే గెలవాలి. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారులో ఉన్నాం... ట్రిబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. తక్కువ సమయమే ఉంది..ఈ వారం పాటు చురుగ్గా పని చేయాలి’ అంటూ టెలికాన్ఫరెన్స్‌లో నేతలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Alliance leadersworkteamlocalelectionsChandrababucalls

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News