రాప్తాడులో గాయపడిన విద్యార్థినికి శస్త్రచికిత్సలు విజయవంతం: నారా లోకేశ్

- రాప్తాడు హైస్కూలులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినికి శస్త్రచికిత్సలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని వైద్యులు వెల్లడించారని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
రాప్తాడు హైస్కూలులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినికి శస్త్రచికిత్సలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని వైద్యులు వెల్లడించారని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం బాలికని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)కు తరలించి, నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచారని వివరించారు. బాలిక కోలుకోవాలని ప్రతి ఒక్కరూ చేసిన ప్రార్థనలు ఫలించాయని చెప్పారు.చికిత్సలో కీలకమైన దశ విజయవంతంగా పూర్తి కావడం ఎంతో ఊరటనిచ్చిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. చిన్నారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య బృందానికి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థిని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ చిరునవ్వులు చిందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని మంత్రి లోకేశ్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ఏపీ విద్యా శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు.
మరోవైపు బెంగళూరుకు మంత్రి లోకేశ్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఓల్డ్ హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రికి నారా లోకేష్ చేరుకుంటారు. ఆ ఆసుపత్రిలో రాప్తాడులో ఉన్మాది దాడిలో గాయపడి.. చికిత్స పొందుతున్న విద్యార్థినిని ఆయన పరామర్శించనున్నారు. అలాగే బాలికకు అందిస్తున్న చికిత్సపై వైద్యులతో మంత్రి లోకేశ్ చర్చిస్తారు.
బాలికకు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆయన కోరనున్నారు. అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పనున్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












