మేడ్చల్ జవహార్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆందోళన.. ఆమరణ దీక్షకు సిద్ధం

హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని జవహార్ నగర్ డంపింగ్ యార్డు పరిస్థితిపై ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. త్వరలోనే డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మల్లారెడ్డి వెల్లడించారు.‘జవహర్ నగర్ నా నియోజకవర్గంలో ఉంది. అది నా గుండె కాయ. జవహర్ నగర్‌పై తాజాగా అమెరికన్ యూనివర్సిటీ విడుదల చేసిన సర్వే ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే మీథేన్ విషవాయువులు అత్యధికంగా ఉద్గారమవుతున్న ప్రాంతాల్లో జవహార్ నగర్ 4వ స్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో రోజుకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. వారి మృతికి కారణం తెలియట్లేదు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జవహార్ నగర్ ప్రాంత పరిస్థితిపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి.. అక్కడి డంప్ యార్డ్‌ను వెంటనే తరలించాలి. డంపింగ్ యార్డ్ నిర్వహణ కోసం రాంకీ సంస్థతో 2006లో ఒప్పందం కుదుర్చుకుంటే.. ఆ సంస్థ డంపింగ్ యార్డ్ నిర్వహణను గాలికి వదిలేసి.. ఆ ప్రాంతాన్ని విషవలయంగా మార్చింది’ అని ఎమ్మెల్యే మల్లారెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












