05/11/2026, Thursday · 08:58:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను ఎవరూ అడ్డుకోలేదు...!*

భవ్య జర్నలిస్ట్ 01/11/2026 5:17 PM వైఎస్సార్ కడప 16

పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను ఎవరూ అడ్డుకోలేదు...!*
Want this news as a newspaper clip?Print News Clip
  • హెలికాప్టర్ అనుమతులపై ఎలాంటి గందరగోళం లేదు*
  • సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు*
  • ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి*.
  • జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి*

జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను ఎక్కడా అడ్డుకోలేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు.
ఆదివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా లతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతులు, పులివెందులలో పోలింగ్ ఏజెంట్లకు సంబంధించిన అంశాలపై వస్తున్న ప్రచారంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చాం..*
మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ పులివెందులకు చేరుకునే సమయంపై తొలుత మధ్యాహ్నం ఒంటి గంటగా సమాచారం అందిందని కలెక్టర్ తెలిపారు. దీనికి అనుగుణంగా ఈ నెల 27వ తేదీనే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చామని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నందున ఎస్పీ ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారని వివరించారు.
అయితే ఆదివారం ఉదయం ఆకస్మికంగా ఉదయం 10 గంటల సమయంలో హెలికాప్టర్ చేరుకుంటుందని సమాచారం వచ్చిందన్నారు. అదే సమయంలో పులివెందుల ప్రాంతంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా ఎస్పీ సూచన మేరకు తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ల్యాండింగ్‌కు అనుమతించినట్లు తెలిపారు. అయితే అప్పటికే హెలికాప్టర్ గాలిలోకి ఎగిరినట్లు ఆపరేటర్ నుంచి సమాచారం రావడంతో, ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉదయం 9.45 గంటలకు ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు.
హెలికాప్టర్ గాలిలోకి ఎగిరిన తర్వాత తిరిగి వెళ్లాలని లేదా వేరే ప్రాంతానికి మళ్లించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
పులివెందులలో 47 మంది పోలింగ్ ఏజెంట్ల నమోదు...*
పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను అనుమతించలేదన్న ప్రచారంలో వాస్తవం లేదని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకల్లా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, అభ్యర్థులు ఇచ్చిన అనుమతి పత్రం, గుర్తింపు కార్డు, ఛాయాచిత్రాన్ని సమర్పించి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
అధికారులకు అందిన సమాచారం ప్రకారం పులివెందులలోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 47 మంది పోలింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటలలోపే నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య కొంతమంది ఏజెంట్లు వివిధ కారణాలతో పోలింగ్ కేంద్రాలను విడిచివెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. మరికొందరు తమ విధుల్లో కొనసాగినట్లు తెలిపారు. ఏ ఒక్క పోలింగ్ ఏజెంట్‌ను గానీ, అభ్యర్థులు అనుమతించిన ప్రతినిధులను గానీ అధికారులు అడ్డుకోలేదని స్పష్టం చేశారు.
వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా..*
పులివెందులలోని అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల లోపలి పరిస్థితులను వెబ్‌కాస్టింగ్ ద్వారా, బయట పరిస్థితులను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపినట్లు గానీ, దౌర్జన్యానికి పాల్పడినట్లు గానీ ఎలాంటి ఘటనలు ఈ దృశ్యాల్లో నమోదు కాలేదన్నారు. ఈ విషయంపై సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
ప్రజలు నిర్భయంగా ఓటు వేయచ్చు.
జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో 560 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. కొన్ని శాంతిభద్రతలకు సంబంధించిన ఘటనలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని 100 మీటర్ల వెలుపల చోటుచేసుకున్నప్పటికీ, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లాలో సుమారు 50 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సామాజిక మాధ్యమాల్లో, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను చూసి ఓటర్లు అయోమయానికి గురికావద్దని, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

polling agentsblockedTigerWoods

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News