ఆర్నబ్ తుఫాన్‌తో రైతులకు తీవ్ర నష్టం.. బాధితులను ఆదుకుంటాం: ఎంపీ సానా సతీష్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పర్యటించారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుతో కలిసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఎంపీ పరిశీలించారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలపై జిల్లా అధికారులను అడిగి వివరాలు సేకరించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. బాధిత ప్రజలకు అవసరమైన సహాయం తక్షణమే అందేలా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఎంపీ ఆదేశించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావం ఇంకా తొలగిపోలేదని.. దీని వల్ల రైతులు అధికంగా నష్టపోయారని తెలిపారు. చెట్లు కూలడం వల్ల చిన్న వ్యాపారస్థులు, ఆటోవాలాలు ఎక్కువగా నష్టపోవడం జరిగిందన్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలో యుద్ధ ప్రాతిపదికన అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారని సానా సతీష్ తెలిపారు.
కోనసీమకు అపార నష్టం: ఎమ్మెల్యే ఆనందరావు
ఈ ఆర్నబ్ తుఫాన్ 1996ను గుర్తు చేసిందని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. కొమరగిరిపట్నం, ఓడలరేవు తీరంలో తుఫాన్ తాకిందని.. దీంతో కోనసీమ జిల్లాకు అపార నష్టం వాటిల్లిందని వెల్లడించారు. 20 శాతం కొబ్బరి చెట్లు విరిగిపడిపోయాయని తెలిపారు. మరో 20 శాతం కొబ్బరి చెట్ల మొవ్వులు ఊడిపోయి ధ్వంసం అవడంతో అవి బ్రతికే ఆస్కారం లేదన్నారు. తోపుడుబండ్ల వ్యాపారులు, ఆటోవాలాలు తీవ్రంగా నష్టపోయారని.. అందరినీ సీఎం ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. తుఫాన్ ప్రభావతి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కచ్చితంగా పర్యటిస్తారని.. ఆయన దిశానిర్దేశంలోనే అందర్నీ ఆదుకుంటామని ఆనందరావు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












