తుమ్మిడిహెట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై చర్చించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ముంపు ప్రభావం, నీటి లభ్యతపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు కేటాయించాలని, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదులకు అదనంగా 0.6 టీఎంసీల నీరు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు నీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంప్‌హౌస్‌లు, పంపులు, ఇతర వ్యవస్థల పనులు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












