రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలి

హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దీపావళి పండగ సందర్భంగా బాణసంచాను రాత్రి 10 గంటల వరకే కాల్చాలని డీసీపీ చిత్తలూరి శ్రీధర్‌గౌడ్ అన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాణసంచా వ్యాపారులు అనుమతి తీసుకున్న తర్వాతనే దుకాణాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు
బాణసంచా వ్యాపారులు పాటించాల్సిన నిబంధనలు ఏమిటి?
డీసీపీ: మల్కాజిగిరి జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టపాసుల వ్యాపారం చేయాలనుకునే వ్యాపారులు ముందుగా డీసీపీ కార్యాలయం, అగ్నిమాపక శాఖ, పేలుడు నియంత్రణ విభాగాల నుంచి అనుమతి తీసుకోవాలి. నిబంధనల ప్రకారం దుకాణాల మధ్య మూడడుగుల దూరం ఉండాలి. ఎదురెదురుగా దుకాణాలను ఏర్పాటు చేయవద్దు. ఇసుకబస్తాలతోపాటు నీటి డ్రమ్ములను, మంటలను ఆర్పే పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి.
టపాసులను రాత్రి ఎన్నిగంటల వరకు కాల్చాలి?
డీసీపీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపావళి పండగ రోజు రాత్రి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలి. రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా టపాసులను కాలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం.
బాణసంచా వ్యాపారులు, కొనుగోలుదారులకు మీరిచ్చే సలహా ఏమిటి?
డీసీపీ: నిబంధనలకు లోబడి బాణసంచా విక్రయించాలి, కాల్చాలి.
బాణసంచా వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
డీసీపీ: 18 ఏళ్ల లోపు బాలబాలికలు ఒంటరిగా టపాసులను కొనుగోలుచేయడానికి వస్తే విక్రయించొద్దు. దుకాణాల్లో డయల్ 112, 101, 108 నెంబర్లను డిస్‌ప్లే చేయాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
ఇదీ చదవండి :: విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. టీడీపీ మేయర్ అభ్యర్థికి భారీ మెజారిటీ..












