05/11/2026, Thursday · 09:02:25 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

బెల్టుషాపు నిర్వాహకులపై పీడీ ఉచ్చు....

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 11:00 AM హైదరాబాద్ 8

బెల్టుషాపు నిర్వాహకులపై పీడీ ఉచ్చు....
Want this news as a newspaper clip?Print News Clip
  • రెండు వారాల్లో ఇద్దరు మహిళా నిర్వాహకులపై పీడీ యాక్ట్‌
  • బోరబండలో అక్రమ మద్యం దందాపై ఖాకీల కొరడా
  • లైసెన్స్‌డ్‌ వైన్స్‌లకు దీటుగా మూడు సీసాలు.. ఆరు పెగ్గులు
  • డ్రై డేల్లోనూ యథేచ్ఛగా నయా దందా

హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతంలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన అక్రమ మద్యం మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నిసార్లు దాడులు చేసినా, బైండోవర్‌ కేసులు నమోదు చేసినా ఏమాత్రం వెరవకుండా ఇష్టారాజ్యంగా గల్లీల్లో మద్యం ఏరులై పారిస్తున్న బెల్టుషాపుల నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకోకుండా, ఏకంగా కఠినమైన పీడీ(ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) చట్టాన్ని ప్రయోగిస్తూ కటకటాల్లోకి నెడుతున్నారు. కొన్నేళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం వ్యాపారం సాగిస్తున్న బంజారానగర్‌కు చెందిన వేముల సరళపై గత నెల 26న పీడీ చట్టం నమోదు చేయగా.. తాజాగా వినాయకరావు నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా బెల్టుషాపు నడుపుతున్న సిహెచ్‌. మారియా అలియాస్‌ మేరీపై సైతం అదే చట్టాన్ని ప్రయోగించి గురువారం జైలుకు తరలించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళా నిర్వాహకులపై వరుసగా పీడీ యాక్ట్‌ నమోదు కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇతర బెల్టుషాపు నిర్వాహకుల్లో వణుకు పుట్టిస్తోంది.

డ్రై డేల్లో దండిగా గల్లాపెట్టె..

రూ.కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం నుంచి లైసెన్స్‌లు పొందిన అధికారిక మద్యం దుకాణాలకు దీటుగా బోరబండ గల్లీల్లో బెల్టుషాపుల సామ్రాజ్యం విస్తరించింది. స్థానిక వైన్స్‌ షాపులతోపాటు గోదాముల నుంచి గుట్టుచప్పుడు కాకుండా భారీగా మద్యం నిల్వలను తరలించి సమాంతర విక్రయాలు సాగిస్తున్నారు. ఉదయం వైన్స్‌ తెరవక ముందే మొదలై.. రాత్రి దుకాణాలు మూసిన తర్వాత అర్ధరాత్రి వరకూ ఈ షాపుల వద్ద మద్యం బాబుల తాకిడి రద్దీగా ఉంటోంది. నగరంలో ఎక్కడా మద్యం దొరకకపోయినా బోరబండ ప్రాంతానికి వస్తే 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్న ప్రచారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం,

గాంధీ జయంతి లాంటి ‘డ్రై డే’ నిబంధనలు ఈ అక్రమ వ్యాపారులకు ఏమాత్రం వర్తించడం లేదు. అధికారిక మద్యం దుకాణాలు మూతపడే రోజుల్లోనే వీరికి అసలైన వ్యాపారం నడుస్తోంది. ఎమ్మార్పీ రేట్లను ఇష్టానుసారం పెంచేసి ఒక్కో బాటిల్‌పై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా దండుకుంటూ మూడు సీసాలు.. ఆరు పెగ్గులుగా దందా సాగిస్తున్నారు. ఇటీవల ముగిసిన గాంధీ జయంతి నాడు నగరమంతా వైన్స్‌లు బంద్‌ పాటించగా.. బోరబండ బెల్టుషాపుల వద్ద మాత్రం మద్యం ఏరులై పారడం గమనార్హం. రేయింబవళ్లు తేడా లేకుండా కొనసాగుతున్న ఈ దందాతో స్థానిక కాలనీల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయి, కుటుంబాలు వీధిన పడుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్థానిక పోలీసుల సాధారణ తనిఖీలతో ఆశించిన మార్పు రాకపోవడంతో.. నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ స్పందించి బెల్టుషాపుల ఆటకట్టించేందుకు పీడీ చట్టం ప్రయోగించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనలు అతిక్రమిస్తే బెల్టు తీస్తాం

బోరబండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో బెల్టుషాపులనేవే లేకుండా సమూలంగా ఏరివేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే ఇద్దరిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకున్నాం. ఇంకా ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి విక్రయిస్తే వారిపై మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు. బెల్టుషాపులకు అక్రమంగా నిల్వలు సరఫరా చేస్తున్న స్థానిక వైన్స్‌లపైనా నిఘా ఉంచాం. వారిపైనా కేసులు నమోదు చేస్తాం. కాలనీల్లో ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే స్థానికులు డయల్‌ 112 లేదా పోలీసులకు నేరుగా సమాచారం ఇవ్వాలి. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

beltshop managerstrap

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News