ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

- ఆ రెండు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలి
- నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) ఈరోజు (శనివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయొద్దని సూచించారు. నవంబర్ 6వ తేదీన జరగనున్న టీజీపీఎస్సీ ఏఈఈ (TGPSC AEE) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. SSC JE, టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఒకే తేదీలో ఉండటంతో వేలాది మంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో SSC JE పరీక్ష రాసే అభ్యర్థులు వెంటనే తెలంగాణకు తిరిగివచ్చి ఏఈఈ పరీక్ష రాయడం ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.
ఆ రెండు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలి
ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన రెండు పోటీ పరీక్షల్లో నిరుద్యోగ యువత ఒకదాన్ని వదులుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. పరీక్షల తేదీలు మార్చాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా టీజీపీఎస్సీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పరీక్షల తేదీలను పున: పరిశీలించాలని అక్టోబర్ 14వ తేదీనే టీజీపీఎస్సీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారని ప్రస్తావించారు. నిరుద్యోగ యువత రెండు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరారు.
నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దు..
ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల్లో పరీక్షల తేదీలు మార్చినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? అని హరీశ్‌రావు నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్.. భేషజాలకు పోయి నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దని హితవు పలికారు. తక్షణమే జోక్యం చేసుకొని నవంబర్ 6వ తేదీన జరగనున్న టీజీపీఎస్సీ ఏఈఈ (సివిల్) పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం జరగకుండా ప్రభుత్వం, టీజీపీఎస్సీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












