05/11/2026, Thursday · 09:02:23 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

100 మానవ మెదళ్లతో 3డీ మ్యాపింగ్‌

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 2:33 PM జాతీయం 6

100 మానవ మెదళ్లతో 3డీ మ్యాపింగ్‌
Want this news as a newspaper clip?Print News Clip
  • పిండం నుంచి వృద్ధుల బ్రెయిన్‌ వరకు సేకరణ
  • మెదడును మ్యాపింగ్‌ ఎలా చేస్తారు..?

 జీవితంలోని వివిధ దశల్లో మానవ మెదడు, దానిలోని ప్రతి కణంతో ఎలా పనిచేస్తుంది..? మెదడుకు సంబంధించిన వివరణాత్మక 3డీ మ్యాప్‌... వ్యాధులను మరింత బాగా అర్థం చేసుకోవడానికి, శస్త్రచికిత్సలు ప్లాన్‌ చేయడానికి, మరింత ప్రభావంతమైన చికిత్సను అందించడానికి ఎలా సహాయపడుతుంది..? అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనే దిశగా ఐఐటీ మద్రా్‌సలోని ‘సుధా గోపాలకృష్ణన్‌ బ్రెయిన్‌ సెంటర్‌’ కృషి చేస్తోంది. దీనికోసం ప్రపంచంలోనే తొలిసారిగా పిండ దశ నుంచి, వృద్ధుల (85 ఏళ్ల వయస్సు) వరకు 100 పైగా మానవ మెదళ్లను సెల్యులార్‌ రిజల్యూషన్‌లో 3డీ మ్యాపింగ్‌ చేస్తోంది. మానవ మెదడుకు సంబంధించిన ఈ 3డీ రిఫరెన్స్‌ మ్యాప్‌... మెదడులోని నిర్మాణాలు, కణాలు.. అవి ఎలా అమర్చబడి ఉన్నాయో, అలాగే వయస్సు పెరిగేకొద్దీ అవి ఎలా మారతాయో చూపిస్తుంది. ‘ఇతర అవయవాల్లా కాకుండా మానవ మెదడు నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. వివిధ వయస్సుల్లో మెదడు ఎలా ఉంటుందో తెలిపే ఒక ‘మ్యాప్‌’ మనకు అవసరం. అప్పుడే మనం దీన్ని వైద్య రంగంలో ఉపయోగకరంగా మార్చగలం’ అని సుధా గోపాలకృష్ణన్‌ బ్రెయిన్‌ సెంటర్‌ అధినేత ప్రొఫెసర్‌ మోహనశంకర్‌ శివప్రకాశం తెలిపారు.దానం చేసిన మెదడులను గడ్డ కట్టించడంతో ఈ ప్రక్రియ మొదలువుతుంది. ఆ తర్వాత వెంట్రుక మందం కంటే తక్కువగా ఉండేలా వేలాది సన్నిని పొరలు (10 నుంచి 20 మైక్రాన్ల మందం)గా వాటిని కట్‌ చేస్తారు. ఇలా ఒక్కో వయోజనుడి మెదడును సుమారు 8,000 నుంచి 10,000 పొరలుగా చేస్తారు. పిండం మెదడు నుంచి సుమారు 3,000, చిన్న పిల్లల మెదడు నుంచి సుమారు 5,000 పొరలు తీస్తారు. అనంతరం ప్రతి పొరనూ ఇమేజింగ్‌ చేసి, వాటన్నింటినీ కలిపి అత్యాధునిక 3డీ మోడల్‌గా పునర్నిర్మిస్తారు. సాధారణంగా ఒక ఎంఆర్‌ఐ స్కాన్‌ మిల్లీమీటర్ల స్థాయిలో సమాచారాన్ని అందిస్తుంది. కానీ.. ఈ 3డీ అట్లాస్‌ మెదడు కణ నిర్మాణాన్ని మరింత సూక్ష్మంగా చూపిస్తుంది. తద్వారా సాంప్రదాయ ఇమేజింగ్‌ ద్వారా గుర్తించలేని వివరాలను కూడా దీని ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. మానవ మెదడు నిర్మాణం ఎలా అభివృద్ధి చెందుతుంది. ఎలాంటి మార్పులకు లోనవుతుంది. ఎలా వృద్ధాప్యానికి గురవుతుంది.. వంటి విషయాలను అర్థం చేసుకోవడమే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు లక్ష్యం. పిండం మెదడు, శిశువుల మెదడు, వృద్ధుల మెదడు వాటి నిర్మాణం, అభివృద్ధిలో తేడాలు ఉంటాయి.

ఆ దశలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రిఫరెన్స్‌ మ్యాప్‌లను రూపొందించడం ద్వారా.. వివిధ వయసుల్లో ఏది సాధారణంగా ఉంటుందో శాస్త్రవేత్తలు గుర్తించగలరు. అసాధారణమైన పరిస్థితి ఎక్కడ, ఎలా తలెత్తుతుందో సులభంగా అర్థం చేసుకోగలరు. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటికే పిండ దశ మెదడుకు సంబంధించిన ‘ధరణి’, బ్రెయిన్‌ స్టెమ్‌ కోసం ‘యాంకర్‌’, పక్షవాత ప్రభావిత మెదడు కోసం ‘సీ-స్ట్రోక్‌’ అనే 3డీ అట్లా్‌సలను విడుదల చేశారు. తమ వద్ద ఉన్న మ్యాప్‌లను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, వైద్య సంస్థలు వాటిని వినియోగించుకునేలా చేయడం ఈ కేంద్రం ఉద్దేశమని ప్రొఫెసర్‌ శివప్రకాశం తెలిపారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

3di myapimgmanavamedallato

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News