05/11/2026, Thursday · 08:58:40 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆర్న‌బ్ తుఫాన్‌ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 3:15 PM జాతీయం 14

ఆర్న‌బ్ తుఫాన్‌ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం
Want this news as a newspaper clip?Print News Clip

ఆర్న‌బ్ తుఫాన్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తమైంది. తుఫాన్ నేపథ్యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి అనిత‌ నిరంత‌రం సమీక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నానికి 215 కిలోమీట‌ర్ల దూరంలో తుఫాన్‌ కేంద్రీకృత‌మైందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రేపు(బుధవారం) ఉద‌యం యానం వ‌ద్ద తీరం దాటే సూచ‌న‌లు ఉన్నాయని పేర్కొంది. తీరం వెంబ‌డి స‌ముద్ర‌పు కెర‌టాలు ఎగ‌సిప‌డుతున్నాయని వెల్లడించింది. స‌ముద్ర‌పు అల‌లు 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వ‌ర‌కు ఎగ‌సి ప‌డే అవ‌కాశం ఉందని పేర్కొంది.

ఉత్త‌రాంధ్ర‌, కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్..

‘ఉత్త‌రాంధ్ర‌, కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు ఉన్నాయి. 14 జిల్లాల‌కు 12 ఎన్డీఆర్ ఎఫ్‌, 10ఎస్డీఆర్ ఎఫ్ ద‌ళాల‌ను స‌హాయ చ‌ర్య‌ల కోసం అధికారులు త‌ర‌లించారు. 20 జిల్లాల్లో 2,131 తుఫాన్ షెల్ట‌ర్ ప్రాంతాలను ఏర్పాటు చేశాం. 18 జిల్లాల్లో 2.70 కోట్ల మంది మొబైల్స్‌కు నిరంత‌రం తుఫాన్ హెచ్చ‌రిక‌లు జారీ చేశాం. సముద్ర తీర ప్రాంతాల్లో 30,043 ఫిషింగ్ బోట్లు నిలిచిపోయాయి. తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో 1,087 వైద్య బృందాలను ఏర్పాటు చేశాం. 8,281 అత్య‌వ‌స‌ర ప‌డ‌క‌లు, 1,274 అంబులెన్సులను అధికారులు సిద్ధం చేశారు. పాముకాటు బారీ నుంచి ర‌క్షించేలా ఆస్పత్రుల్లో 21,536 యాంటీ స్నేక్ వీన‌మ్‌లు సిద్ధంగా ఉన్నాయి. 1,351 మంది గ‌ర్భిణుల‌ను ఇప్ప‌టికే ఆస్పత్రుల‌కు సుర‌క్షితంగా త‌ర‌లించాం. 2,613 మంచినీళ్ల ట్యాంక‌ర్లు, 2,430 జ‌న‌రేట‌ర్లు, 4,448 ఆర్వో ప్లాంట్లు సిద్ధం చేశాం. 14,686 రేష‌న్ దుకాణాల్లో రెండు నెల‌ల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌రాలను ముంద‌స్తుగానే నిల్వ చేశాం. పంట‌లకు న‌ష్టం వాటిళ్లకుండా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని 35.96 ల‌క్ష‌ల మంది రైతుల‌కు సూచ‌న‌లు జారీ చేశాం. ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌పై నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నాం. 419 గిరిజ‌న హాస్ట‌ళ్ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాం. హాస్ట‌ళ్ల‌లో ఉంటున్న 88,083 మంది విద్యార్థుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా అధికారులు ముంద‌స్తు ఏర్పాట్లు చేశారు. 550 జేసీబీలు, 596 ఎల‌క్ట్రిక్ రంపాలను రోడ్లు, భ‌వ‌నాల శాఖ సిద్ధం చేసింది. 1,079 జ‌లాశ‌యాల వ‌ద్ద ప‌రిస్థితిని నిరంత‌రం అధికారులు స‌మీక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ నుంచి జిల్లాల్లో ప‌రిస్థితిని 24/7 అధికారులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. జిల్లాల్లో చేప‌ట్టిన తుఫాన్ ముంద‌స్తు స‌న్న‌ద్ద‌త ఏర్పాట్ల‌ను ఆర్టీజీ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు నిరంతరం స‌మీక్షిస్తున్నారు. తుఫాన్ ప్ర‌భావిత జిల్లాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని జిల్లాల యంత్రాంగానికి ఆర్టీజీఎస్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చేర‌వేస్తున్నారు’ అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

CycloneArnab EffectGovt

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News