ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. రోహిణిలోని వెంకటేశ్వర్ పబ్లిక్ స్కూల్, మయూర్ విహార్‌లోని సాల్వాన్ పబ్లిక్ స్కూల్‌కు బెదిరింపులు వచ్చాయి. ఉదయం సుమారు 9:37 గంటలకు రోహిణిలోని వెంకటేశ్వర్ పబ్లిక్ స్కూల్‌కు తొలుత బాంబు బెదిరింపు వచ్చింది. అనంతరం ఉదయం 9:57 గంటలకు మయూర్ విహార్‌లోని సాల్వాన్ పబ్లిక్ స్కూల్‌కు కూడా ఇలాంటి బెదిరింపే అందింది. పాఠశాల ప్రాంగణాల్లో బాంబులు ఉన్నాయనే సమాచారంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించాయి.సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వెంకటేశ్వర్ పబ్లిక్ స్కూల్, సాల్వాన్ పబ్లిక్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని పాఠశాలల నుంచి తరలించారు. అనంతరం పోలీసులు, ఫైర్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. మరోవైపు, బాంబు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బెదిరింపుల్లో నిజానిజాలను నిర్ధారించేందుకు భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. విషయం తెలుసుకున్న వెంటనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పాఠశాలల వద్దకు చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తనిఖీల అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు. కాగా, ఇటీవల పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, విమానాశ్రయాలు సహా ఇతర ప్రముఖ ప్రాంతాల్లో బాంబులు పెట్టామని పేర్కొంటూ ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ రావడం సర్వసాధారణమైంది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












