05/11/2026, Thursday · 08:58:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 5:08 PM జాతీయం 15

ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Want this news as a newspaper clip?Print News Clip

ప్రధాని మోదీ నేతృత్వంలో ఈరోజు  కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేబినెట్ శుభవార్త చెప్పింది. డీఏ, డీఆర్ పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 60 శాతం నుంచి 63 శాతానికి డీఏ, డీఆర్ పెరగనున్నాయి. ఈ పెంపు 2026 జూలై 1 నుంచి వర్తించనుందని కేబినెట్ తెలిపింది. 6వ వేతన సంఘం పరిధిలోని వారికి డీఏ/డీఆర్ 262 శాతం నుంచి 269 శాతానికి పెంచుతున్నట్టు వివరించింది. 5వ వేతన సంఘం పరిధిలోని వారికి 483 శాతం నుంచి 497 శాతానికి పెంచినట్టు చెప్పింది. ఈ నిర్ణయంతో 48 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.10,016 కోట్ల అదనపు భారం పడనుంది.

కంటైనర్ తయారీ రంగానికి ప్రోత్సాహం

దేశీయ కంటైనర్ తయారీ పరిశ్రమ బలోపేతమయ్యే దిశగా కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ రంగం అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. వచ్చే 13 ఏళ్ల పాటు ఈ కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకం అమలు కానుంది. ఇందులో భాగంగా కంటైనర్ తయారీ సంస్థలకు రుణాలపై వడ్డీ రాయితీలు, తయారీ యూనిట్లకు భూమి లీజులో రాయితీలు కేంద్రం ఇవ్వనుంది. అలాగే తయారీ సంస్థలకు నిర్వహణ వ్యయాల కింద ఆర్థిక సహాయమూ అందించనుంది. దేశీయ తయారీ యూనిట్లలో స్థానిక ఉత్పత్తుల వినియోగం పెంపునకు చర్యలూ తీసుకోనుంది.

క్రీడా వస్తువుల తయారీకి ఊతం

భారతదేశాన్ని ప్రపంచ స్థాయి క్రీడా వస్తువుల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో కేంద్రం కీలక అడుగు వేయనుంది. ఇందుకోసం ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ తయారీ పథకానికి రూ.1,856 కోట్ల నిధులు కేటాయించింది. దేశంలో 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నాలుగు క్రీడా వస్తువుల తయారీ జోన్లు ఏర్పాటు చేయనుంది. అర్హత కలిగిన ప్రధాన పెట్టుబడిదారులకు 20 శాతం మూలధన వ్యయ ప్రోత్సాహకం అందించాలని కేంద్రం భావిస్తోంది. రూ.10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే తయారీదారులకు 15 శాతం వరకు ప్రోత్సాహకాలు అందించేందుకూ సిద్ధమైంది. అర్హత కలిగిన స్పోర్ట్స్ స్టార్టప్‌లకు రూ.20 లక్షల వరకు గ్రాంట్లు ఇవ్వనుంది.

గ్రామ పంచాయతీల బలోపేతానికి కొత్త పథకం

కేబినెట్ సమావేశ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజనకు ఆమోదం లభించింది. ఐదేళ్లలో రూ.7,395 కోట్ల వ్యయంతో దీన్ని అమలు చేయాలని కేంద్రం సంకల్పించింది. తద్వారా దేశవ్యాప్తంగా 2.78 లక్షలకు పైగా గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. ఈ పథకంతో 32 లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యక్ష ప్రయోజనం ఉండనుంది. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చేలా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

key decisionshikeemployeesUnionCabinet

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News