చంద్రశేఖరన్‌ను మళ్లీ ఎలా నియమించారు? నోయల్ టాటా సవాలు

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌ను మళ్లీ నియమించడాన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా సవాలు చేశారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌ను మళ్లీ ఎలా నియమిస్తారని బోర్డు నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు తీసుకున్న నిర్ణయంపై నోయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈనెల 26న టాటా సన్స్ కంపెనీ సెక్రటరీ సుప్రకాష్ ముఖోపాధ్యాయకు ఆయన ఎనిమిది పేజీల లేఖ రాశారు. ఆ లేఖ కాపీని కంపెనీ బోర్డు డైరెక్టర్లకు కూడా పంపించారు.సెప్టెంబర్ 17న చంద్రశేఖరన్ పునర్నియామకానికి ఆమోదం తెలుపుతూ తీసుకున్న తీర్మానం చెల్లదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పునర్నియామకానికి సంబంధించిన బోర్డు సమావేశ రికార్డులు, ఓటింగ్ వివరాలు, ప్రయోజనాల సంఘర్షణకు సంబంధించిన ప్రకటనలు, నిర్ణయానికి మద్దతుగా ఉన్న న్యాయపరమైన అభిప్రాయాలను అందించాలని నోయల్ కోరారు. ఈ వ్యవహారంలో రెండు అంశాలను ఆయన లేవనెత్తారు. టాటా సన్స్ సంస్థ నిబంధనల ప్రకారం కంపెనీ నిర్దేశించిన విధానాన్ని అనుసరించే చంద్రశేఖరన్ పునర్నియామకానికి ఆమోదం తెలిపారా? టీవీఎస్ మోటార్‌కు సంబంధించిన పొటెన్షియల్ ప్రయోజనాల వివాదాల అంశాలను బోర్డు పరిశీలనకు ముందే వెల్లడించారా? అని నోయల్ ప్రశ్నించారు.ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు సెప్టెంబర్ 17న జరిగిన సమావేశంలో టాటా సన్స్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ అంశాన్ని సమావేశ ఎజెండాలో చేర్చలేదని నోయెల్ తన లేఖలో అభ్యంతరం తెలిపారు. సమావేశానికి సంబంధించిన అసలు ఎజెండాలోగానీ, సవరించిన ఎజెండాలోగానీ చంద్రశేఖరన్ పునర్నియామక ప్రతిపాదనను స్పష్టంగా పేర్కొనలేదని ఆయన ఆరోపించారు. సంబంధిత అంశంలో నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్‌ఆర్‌సీ) నుంచి వివరాలు తెలుసుకోవడానికే ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. ఆ కమిటీ అజెండా, సమావేశ మినిట్స్‌ను డైరెక్టర్లకు పంపించకుండానే పునర్నియామక అంశాన్ని ఎలా పరిశీలించారని నోయల్ ప్రశ్నించారు. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 118 ప్రకారం ఎంపిక కమిటీని ఏర్పాటు చేయకపోవడంపైనా నోయెల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీవీఎస్ మోటార్, చంద్రశేఖరన్ కుటుంబానికి చెందిన ఓ కంపెనీ మధ్య వ్యాపార లావాదేవీలపైనా నోయెల్ ప్రశ్నలు లేవనెత్తారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












