మైక్రోసాఫ్ట్‌లో చేరిన 3 నెలలకే జాబ్ పోయింది.. భారత టెకీ ఆవేదన

మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించిన వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ సంస్థ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. స్వచ్ఛందంగా తప్పుకుంటారా? అంటూ సంస్థ ఇచ్చిన ఆఫర్ అనేక మంది భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చింది. ఉద్యోగం తప్ప మరే ఆధారమూ లేని అనేక మంది దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ అందిన వారీలో తానూ ఉన్నానంటూ భారత టెకీ ఈ పోస్టు పెట్టారు. ఆ తరువాత కాసేపటికే తీసేశారు. అప్పటికే ఆ పోస్టు తాలూకు స్క్రీన్ షాట్స్ వైరల్‌గా మారడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.తనకు మూడు గంటల క్రితమే వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ మెయిల్ వచ్చిందని సదరు టెకీ ఆ పోస్టులో పేర్కొన్నాడు. ‘నేను మూడు నెలల క్రితమే జాబ్‌లో చేరా. వాళ్ల ఆఫర్ తీసుకుంటే డబ్బు వస్తుంది. డిసెంబర్ 31 నాకు సంస్థలో చివరి రోజు అవుతుంది. అసలు నేను జీవితంలో ఇంతగా కష్టపడింది ఎందుకో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎంతో మంది ఉన్నారు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని సూక్ష్మమైన అంశాలు ఉన్నాయి. ఆఫర్ ప్రకటించిన సంస్థ నాలాంటి కొందరికి మాత్రమే మెయిల్స్ పంపించింది. అంటే నేను లేఆఫ్స్ లిస్టులో ఉన్నట్టే. ఎలాగొలా నన్ను వదిలించుకోవాలని వారు భావిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. నాకు మూడేళ్ల అనుభవం మాత్రమే ఉంది. కుటుంబ వ్యాపారాలు ఏవీ లేవు. నా వద్ద ఉన్న డబ్బు ఆరు నెలల వరకే సరిపోతుంది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఎవరైనా సలహా చెబుతారా?’ అని సదరు టెకీ పోస్టు పెట్టారు.ఆందోళనతో ఉన్న టెకీకి కొందరు విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన అనుభవం ఉన్న అతడి ఇంకెక్కడైనా సులువుగా జాబ్ వస్తుందని చెప్పారు. నెల రోజుల క్రితం చేరిన తనకూ ఈ ఈమెయిల్ వచ్చిందని మరొకరు అన్నారు. టెన్షన్ వద్దని, మైక్రోసాఫ్ట్‌లో పని అనుభవం ఉన్న వారికి బయట అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భారత్‌తో పాటు యూకే, యూఎస్, కెనడాల్లోని ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












