నేపాల్‌లో ఘోర ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఒకరి మృతి!

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గంలోని సోలుఖుంబు జిల్లాలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఫెరిచే ప్రాంతంలోని ఒకే హెలిప్యాడ్‌పై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఫిష్‌టైల్ ఎయిర్.. ఎయిర్ డైనాస్టీ సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.ఈ ప్రమాదంలో ఓ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పర్వత ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పర్యాటకుల రాకపోకలకు కీలకమైన ఈ ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు ఒకేసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించడం ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే హెలికాప్టర్ ద్వారా లుక్లాకు తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. మృతుడి పూర్తి వివరాలు, గాయపడిన వ్యక్తి గుర్తింపు తదితర వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. రెండు హెలికాప్టర్లు ఒకే సమయంలో హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు, సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












