05/11/2026, Thursday · 08:58:43 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఈ ట్రాన్స్‌మహిళ డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:58 AM జాతీయం 14

ఈ ట్రాన్స్‌మహిళ డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌
Want this news as a newspaper clip?Print News Clip

అతికొద్దిమంది మాత్రమే విధి విధించే కఠిన పరీక్షలకు ఎదురొడ్డి నిలుస్తారు. ఆత్మవిశ్వాసంతో సవాళ్లను అధిగమిస్తారు. సంకల్ప దీక్షతో విజేతలుగా నిలుస్తారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతారు... డాక్టర్‌ కొయ్యాల రూత్‌జాన్‌ పాల్‌. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తిచేసిన తొలి ట్రాన్స్‌మహిళగా చరిత్ర లిఖించారు. ఈ క్రమంలో ఆమె న్యాయపోరాటం సైతం సాగించారు. డాక్టర్‌ అవ్వాలన్న కలను సాకారం చేసుకొన్న డాక్టర్‌ రూత్‌ విజయ ప్రస్థానంలోని విశేషాలు ఆమె మాటల్లోనే... ‘ఆత్మగౌరవాన్ని పెంపొందించే అత్యంత శక్తిమంతమైన ఆయుధం చదువు’’ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పిన ఈ స్ఫూర్తిదాయకమైన బోధనలే ఒక వైద్యురాలిగా నన్ను ఇంతవరకు తీసుకొచ్చాయి. కేవలం ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మాత్రమే కాదు, దేశంలోనే ‘డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ (ఎండీ) పూర్తిచేసిన మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తిగా గర్విస్తున్నాను. ఎంబీబీఎస్‌ తర్వాత ఉద్యోగం కోసం దాదాపు 20కు పైగా ఆస్పత్రులకు వెళ్లుంటాను. ‘ఫోన్‌ చేసి చెబుతాం. మెయిల్‌ చేస్తాం’ లాంటి సమాధానాలేగానీ ఒక్కరూ అవకాశం ఇవ్వలేదు. అయినా కుంగిపోలేదు. ఉద్యోగ ప్రయత్నాలూ ఆపలేదు. అదే సమయంలో ట్రాన్స్‌ కమ్యూనిటీ కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి హైదరాబాద్‌లో ‘మిత్ర క్లినిక్‌’ ప్రారంభించాయి. అందులో పార్ట్‌టైమ్‌ డాక్టరుగా ప్రాక్టీసు చేస్తుండగానే, ఉస్మానియా ఆస్పత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాను. ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా ఏదో వెలితి. లోటు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది కదా... అనుకోలేకపోయాను. నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షకు మొదటిసారి 2021లో దరఖాస్తు చేశాను. అప్లికేషన్‌లో స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్‌జెండర్‌ కాలమ్‌ చూసి మురిసిపోయాను. పరీక్ష రాసి తీరా కౌన్సెలింగ్‌కు వెళితే... అందులో ట్రాన్స్‌ మహిళా రిజర్వేషన్‌ కోటానే లేదు. సీటు కేటాయింపులో షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ (ఎస్సీ) మహిళా కేటగిరి కింద నన్ను పరిగణిస్తున్నారు. తరువాత ఏడాది మళ్లీ పరీక్ష రాశాను. మంచి ర్యాంకు వచ్చినా, అదే సమస్య. నా అస్తిత్వానికి తగిన గుర్తింపు లభించేవరకు పోరాటం ఆపకూడదని నిర్ణయించుకున్నాను.

కోర్టుకెళ్లి సీటు సాధించా...

నన్ను ఎస్సీ ట్రాన్స్‌ మహిళగా గుర్తించాల్సింది’గా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)కు లేఖ రాశాను. ‘ట్రాన్స్‌జెండర్‌ రిజర్వేషన్‌ అంశంపై అవగాహన లేని కారణంగా సీటు కేటాయించలేకపోతున్నాం. ఇలాంటి సమస్య మా దృష్టికి రావడం ఇదే మొదటిసారి. కనుక ఏమీ చేయలేకపోతున్నాం’ అని అవతలి నుంచి సమాధానం. ట్రాన్స్‌జెండర్‌ హక్కుల ఉద్యమకారిణి వైజయంతి వసంత మోగ్లీని కలిస్తే, ఆమె నన్ను హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన మార్గదర్శకత్వంలో నల్సా తీర్పు-2014 ప్రకారం నాకు ఉన్నత విద్యావకాశాలు కల్పించాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాను.

ఓ వైపు కేసు విచారణ జరుగుతుండగానే, 2023లో మూడోసారి పీజీ-నీట్‌ ప్రవేశ పరీక్ష రాశాను. అప్పుడు కూడా మంచి ర్యాంకు వచ్చింది. సుదీర్ఘ విచారణల తరువాత తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నాకు అప్పుడు సనత్‌నగర్‌ ఈఎస్ఐసీ మెడికల్‌ కాలేజీలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ సీటు కేటాయించారు. కానీ కౌన్సెలింగ్‌లో ట్రాన్స్‌జెండర్‌ రిజర్వేషన్‌ కోటాను మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు.

అడుగడుగునా అవమానాలే

కేసు విచారణ సమయంలో అవసరమైన సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ విద్య, వైద్య, ఇతర శాఖల కార్యాలయాలకు వెళ్లినప్పుడు నాకు ఎదురైన అవమానాలు అన్నీఇన్నికావు. ‘మీరు కూడా చదువుకుంటారా?’. ‘నువ్వు నిజంగానే ఎంబీబీఎస్‌ చదివావా?’ లాంటి ప్రశ్నలతో, ఛీత్కారాలతో, నిందాపూరితమైన మాటలతో చాలామంది అధికారులు ఇబ్బంది పెట్టారు. కొన్ని సందర్భాలలో ఆఫీసు లోపలకు కూడా నన్ను రానివ్వలేదు. ఎంబీబీఎస్‌ చదివిన నా పట్లే ఇంత నిర్దయగా సమాజం ప్రవర్తిస్తే... మిగతా ట్రాన్స్‌ వ్యక్తుల పరిస్థితి ఏంటి? అనిపించింది.

అంతెందుకు.. కౌన్సెలింగ్‌లో మొదటి ఆప్షన్‌ కింద నేను కోరిన గైనకాలజీని నిరాకరించారు. ఒక ట్రాన్స్‌ గైనకాలజిస్టు దగ్గరకు ఆడవాళ్లు వైద్యం కోసం వెళ్లగలరా? అని అవతలి న్యాయవాది ప్రశ్నిస్తే... ‘ప్రాణాలు కాపాడే డాక్టరుకు జెండర్‌తో సంబంధం ఏముంది? ఇతర రాష్ట్రాలలో పురుషులు కూడా గైనకాలజీలో స్పెషలైజేసన్‌ చేస్తున్నారు కదా’ అని మా లాయర్‌ రవిచందర్‌ గట్టి వాదనలు వినిపించారు. ఆయన ఒక్క రూపాయికూడా ఫీజు తీసుకోకుండా నా కేసు వాదించారు.

ప్రాణాలు కాపాడే అవకాశం...

ఎమర్జెన్సీ రూమ్‌లో చికిత్స అందించడమంటే కొన్ని సెకన్ల సమయంలోనే విలువైన ప్రాణాలు కాపాడే అరుదైన అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఈ రూపంలో కల్పిస్తున్నాడు అనుకొని కోర్సులో చేరాను. ఎంబీబీఎస్‌ పూర్తయిన ఐదేళ్ల తరువాత పీజీలో చేరడంతో మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. అదే సమయంలో ఈఎస్ఐసీ మెడికల్‌ కాలేజీలో మా హెడ్‌ ఆఫ్‌ ది డిపార్టుమెంట్‌ డాక్టర్‌ తిరుమల సుహాసిని మేడం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ త్రివేణ్‌ సాగర్‌ గారు, ఇతర సిబ్బంది అందించిన ప్రోత్సాహం మరువలేనిది. సహాధ్యాయులు కూడా నాతో స్నేహపూర్వకంగా మెలిగారు. వారందరి సహకారంతోనే కష్టమైనా చాలా ఇష్టంగా మూడేళ్ల ఎండీ కోర్సు మంచి ఫలితాలతో పూర్తిచేయగలిగాను.

గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌, రోడ్డు ప్రమాదంతో తీవ్రమైన రక్తస్రావం లాంటి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన కొన్ని వందల మందికి తగిన చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టగలిగాం. కొన్ని సందర్భాలలో పరిస్థితులు మా చేయి దాటిపోతుంటాయి. అలాంటప్పుడు దుఃఖం వచ్చినా మరుక్షణమే తేరుకొని మరొక కేసు డీల్‌ చేయడానికి సిద్ధమవుతాం. ఈఎస్ఐలోనే సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌గా ఏడాది పని చేయాలి. ఆర్డర్‌ కాపీ వచ్చిన వెంటనే విధుల్లో చేరతాను.

అదే నా కోరిక...

దళిత కుటుంబ నేపథ్యం, పేదరికం... దానికితోడు ట్రాన్స్‌మహిళగా అస్తిత్వంతో డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పూర్తి చేయడం నాకు గొప్ప విజయమే. ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్‌ ఆఫ్‌ ది డిపార్టుమెంట్‌ స్థాయికి ఎదగాలన్నది నా కోరిక. నేను ఎంబీబీఎస్‌ చదివేప్పుడు నాకు సాయం అందించిన డాక్టర్‌ కృష్ణారావు గారు, నా ఒంటరి పోరాటంలో అండగా నిలిచిన అంజలి రిమి, రచన ముద్రబోయిన, ఇంకా మా ట్రాన్స్‌ కమ్యూనిటీ పెద్దలతో పాటు ఉస్మానియా ఆస్పత్రిలో ఉద్యోగ సమయంలో తోడ్పాటు అందించిన అప్పటి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ గారు... వీళ్లందరి చేయూత మరువలేనిది. ట్రాన్స్‌వ్యక్తులు చదువుకోడానికి అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మంచి అవకాశాలు కల్పిస్తోంది. నాకు తెలిసి ఇరవైమందికిపైగా మావాళ్లు అక్కడ చదువుతున్నారు.

వ్యవసాయ కూలీ పనులకెళుతూ...

మాది ఖమ్మంలో రాపర్తి నగర్‌. నా ఎనిమిదో ఏట మా నాన్న చనిపోయారు. నాకు ఒక అన్నయ్య, అక్క. వ్యవసాయ కూలీపనులకు వెళుతూ మమ్మల్ని అమ్మ పోషించింది. కాలేజీ చదువు వరకు ఏటా దసరా, వేసవి సెలవుల్లో అమ్మతో పాటు నేనూ మిరప కోతలు, పత్తి

తీయడం లాంటి కూలీపనులకు వెళ్లాను. మా పొరుగున ఓ ట్రాన్స్‌ మహిళ సరైన వైద్యంలేక చనిపోవడం నా చిన్నతనంలో కళ్లారా చూశాను. ఆ ఘటనే నేను మెడిసిన్‌ చదవడానికి తొలి ప్రేరణ. మామిళ్లగూడెం ప్రభుత్వ హైస్కూల్లో చదివాను. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో ఎక్స్‌లెంట్‌ జూనియర్‌ కాలేజీ వాళ్లు ఉచితంగా ఇంటర్‌ చదివించారు. ఎంబిబిఎస్‌లోనూ నాది ఫ్రీ సీటే! ఒకప్పుడు నన్ను హేళన చేసిన వారంతా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Doctorof MedicineTranswoman

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News