05/11/2026, Thursday · 08:33:17 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జడ్పీ పీఠంపై గురి… కదిరి కేంద్రంగా రాజకీయం!

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 9:51 PM శ్రీ సత్యసాయి 5

జడ్పీ పీఠంపై గురి… కదిరి కేంద్రంగా రాజకీయం!
Want this news as a newspaper clip?Print News Clip
  • నల్లచెరువు నుండి పరిటాల శ్రీరామ్ , గాండ్లపెంట నుండి కసిరెడ్డి వజ్ర భాస్కర్ రెడ్డి పోటీతో పెరిగిన ప్రాధాన్యత.
  • జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయింపు జరిగింది. ఇరు పార్టీల అభ్యర్థులు కదిరి నియోజకవర్గం నుంచే పోటీ.. అభివృద్ధిపై పెరిగిన ఆశలు.

శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయాల్లో కదిరి నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించడంతో ఈ పదవిని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల రవి రాజకీయ వారసుడు, ధర్మవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ అనూహ్యంగా నల్లచెరువు మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో నల్లచెరువు ఎన్నికల ప్రాధాన్యత మరింత పెరిగింది.

నల్లచెరువుపై టీడీపీ ప్రత్యేక దృష్టి

పరిటాల శ్రీరామ్ పోటీతో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం నల్లచెరువుపై ప్రత్యేక దృష్టి సారించింది. ధర్మవరం నియోజకవర్గం నుంచి కాకుండా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువును ఆయన ఎంచుకోవడం వెనుక రాజకీయ ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు, జడ్పీ చైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తున్నట్లు రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి.

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. పరిటాల శ్రీరామ్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఆయన తన రాజకీయ అనుభవాన్ని, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నల్లచెరువు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు , మాజీ మండలాద్యక్షుడు , మాజీ జెడ్పీటిసి మెంబర్ రాజీనామా చేసి కందికుంట వెంకట ప్రసాద్ నాయకత్వం లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామాలు టీడీపీకి మరింత కలిసొచ్చే అంశం..

శ్రీరామ్ విజయం నల్లేరు మీద నడకేనని భావించవచ్చా?

నల్లచెరువులో పరిటాల శ్రీరామ్ విజయం నల్లేరు మీద నడకేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ ఉండకపోవచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన విజయం ఖాయమని చెప్పలేమని ప్రజాస్వామ్య వాదుల అభిప్రాయం .ఏదేమైనా అంతిమంగా ఓటరు నిర్ణయం కొరకు వేచిచూడక తప్పదు.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడంతోపాటు, ప్రత్యర్థి పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమస్యలు, అభ్యర్థుల ప్రజాదరణ, పార్టీ శ్రేణుల సమన్వయం, ఓటర్ల విశ్వాసం వంటి అంశాలు ఫలితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో నల్లచెరువులో పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.

జడ్పీ పీఠం ఆశావహులిద్దరూ కదిరి నియోజకవర్గం నుంచే!

ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన అంశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి కూడా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపెంట మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం. దీంతో ప్రధాన పార్టీల తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని లక్ష్యంగా చేసుకున్న నాయకులు ఇద్దరూ కదిరి నియోజకవర్గం నుంచే తమ రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నారు.

ఇది కదిరి నియోజకవర్గానికి రాజకీయంగా పెరిగిన ప్రాధాన్యతకు నిదర్శనం. అయితే జడ్పీ చైర్మన్ పదవి ఏ పార్టీకి దక్కుతుందన్నది కేవలం ఇద్దరు అభ్యర్థుల విజయాలపైనే కాకుండా, జిల్లా పరిషత్‌లో పార్టీకి లభించే మొత్తం బలంపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల కదిరి నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారన్న దానితోపాటు, జిల్లావ్యాప్తంగా ఇతర మండలాల్లో వచ్చే ఫలితాలు కూడా కీలకం కానున్నాయి.

ప్రశాంత ఎన్నికలే ప్రజాస్వామ్యానికి బలం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాజకీయ విభేదాలు, ఎన్నికల వివాదాలు చర్చనీయాంశమవుతున్న తరుణంలో కదిరి ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుండటం అభినందనీయం. 2019లోనూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లోనూ కదిరిలో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలగకుండా ఎన్నికలు జరగాలన్న ఆకాంక్ష బలంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇదే వాతావరణంలో ప్రశాంతంగా సాగుతాయని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చెబుతున్నారు.

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. కానీ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడటం, ప్రత్యర్థుల అభిప్రాయాలను గౌరవించడం, ఓటర్ల స్వేచ్ఛను పరిరక్షించడం అన్ని పార్టీల బాధ్యత. ప్రజాస్వామ్యానికి నిజమైన విజయం ప్రత్యర్థిని ఓడించడంలో మాత్రమే కాదు; ప్రజల తీర్పును గౌరవించడంలోనూ ఉంది.

రాజకీయ ప్రాధాన్యత అభివృద్ధికి దోహదపడాలి

వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన కదిరి అభివృద్ధికి ఈ ఎన్నికలు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. జిల్లా పరిషత్ ద్వారా గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధిత పథకాలు, అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించే అవకాశం ఉంది. అయితే నిధుల కేటాయింపులు, అధికారాలు ప్రభుత్వ నిబంధనలు, బడ్జెట్, సంబంధిత శాఖల పరిధికి లోబడి ఉంటాయి. జడ్పీ చైర్మన్ సమన్వయం, ప్రాధాన్యతల నిర్ణయం, నిధుల వినియోగ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించగలరు.

కదిరి నియోజకవర్గానికి రాజకీయంగా పెరిగిన ప్రాధాన్యత కేవలం పదవుల పోటీతోనే పరిమితం కాకూడదు. ఏ పార్టీ జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకున్నా, కదిరి ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వెనుకబడిన మండలాలకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు అందేలా కృషి చేయాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి.

రాజకీయ పోటీ తాత్కాలికం… ప్రాంత అభివృద్ధి శాశ్వతం. కదిరి నియోజకవర్గం నుంచి జిల్లా రాజకీయాలకు దిశానిర్దేశం చేసే నాయకత్వం ఎదగాలని, జిల్లా పరిషత్ ద్వారా ఈ ప్రాంతానికి సముచిత ప్రాధాన్యత లభించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగి, ప్రజల తీర్పు గౌరవించబడి, కదిరి అభివృద్ధి పథంలో ముందుకు సాగితే అదే నూతన రాజకీయ పరిణామాలకు నిజమైన సార్థకత.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

జడ్పీ పీఠంపై గురి… కదిరి కేంద్రంగా రాజకీయం!

Kendra PoliticsAimPeethKadiri

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News