05/11/2026, Thursday · 08:34:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జడ్పీ పీఠంపై ఆశ.. నిరాశ

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 12:09 PM శ్రీకాకుళం 10

జడ్పీ పీఠంపై ఆశ.. నిరాశ
Want this news as a newspaper clip?Print News Clip
  • ‘ఐవీఆర్‌ఎస్‌’తో టీడీపీ అభిప్రాయ సేకరణ
  • అభ్యర్థి ఎంపికపై కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. జిల్లాపరిషత్‌ పీఠంపై కొంతమంది అభ్యర్థులకు ఆశ కలుగుతుండగా.. మరికొంతమందికి మాత్రం నిరాశగా మారుతోంది. జడ్పీ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ బీసీ మహిళకు కేటాయించడంతో.. చాలామంది ఆ పీఠంపై ఆశలు పెంచుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం లేకుండా అన్ని అసెంబ్లీ స్థానాలను, ఎంపీ స్థానాలను సైతం గెలిపించామని.. ఇప్పుడు కలిసివచ్చిన రిజర్వేషన్లతో తాము కోరుకున్న పదవులు వరిస్తాయని పలువురు భావించారు. నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు కలిగిన ఉత్సాహం.. ఇప్పుడు చల్లారిపోయింది. నేతల భరోసా దక్కకపోవడంతో చేసేదిలేక కొందరు నామినేషన్‌ వేసే ప్రయత్నమూ చేయలేదు. మరొకరు మాత్రం.. చివరి వరకూ చూద్దామన్న ఆశతో నామినేషన్‌కు ఉపక్రమిస్తున్నారు.

పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ.. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే.. తన సతీమణితో జడ్పీటీసీగా నామినేషన్‌ వేయించేందుకు ప్రయత్నించారు. కానీ సమీకరణాలు వీలుపడలేదు. దీంతో ఆయన జడ్పీ పీఠంపై పెట్టుకున్న ఆశ నిరాశగా మారింది.

మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నేడు ఎచ్చెర్ల నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ వేస్తున్నారు. అధిష్ఠానం నుంచి భరోసా తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది.

బూర్జ మండలం నుంచి జడ్పీటీసీగా రంగంలోకి దిగి.. జడ్పీ పీఠాన్ని అధిరోహించాలనుకున్న మాజీఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్‌ కుటుంబానికి.. నిరాశ ఎదురైంది. బూర్జ రిజర్వేషన్‌ మారిపోయింది. సరబుజ్జిలి నుంచి పోటీ చేద్దామంటే .. స్థానిక నేతలు కలసిరాలేదు.

పొందూరు నుంచి శుక్రవారం జడ్పీటీసీ అభ్యర్థిగా కూన ప్రమీల (పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి) నామినేషన్‌ వేసే అవకాశముంది. జడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో ఈమె పేరు వినిపిస్తోంది. అలాగే ఆమదాలవలస నుంచి తమ్మినేని సుజాత పేరు కూడా వినిపిస్తోంది. జడ్పీ పీఠం.. ఆమదాలవలస నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది.

ఐవీఆర్‌ఎస్‌తో అభిప్రాయ సేకరణ..

తెలుగుదేశం పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీ పరంగా జనాలు, నాయకులు, కార్యకర్తలు తప్పులెంచకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ప్రతి మండలం నుంచి టీడీపీ తరపున జడ్పీటీసీ స్థానాన్ని ఆశిస్తున్నవారి వివరాలను ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజలకు ఫోన్‌కాల్‌ చేసి.. అభిప్రాయాలు సేకరిస్తోంది. ప్రజాభిప్రాయం మేరకు అభ్యర్థుల తుది జాబితా.. బీఫారాల అందజేత ప్రక్రియను టీడీపీ అధిష్ఠానం చేపట్టనుంది. నేడో, రేపో నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతానికి నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

pedestal DisappointmentHope

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News