ఏపీ స్థానిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై 33,014 కేసులు.. 244 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనలు (MCC), శాంతిభద్రతల అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, APSEC కో-ఆర్డినేషన్ ఐజీ బి. రాజాకుమారి ఈరోజు (మంగళవారం) సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అక్టోబరు 27వ తేదీన నమోదైన వివరాలను(రోజువారీ గణాంకాలు) వెల్లడించారు. అక్టోబరు 27వ తేదీన ఒక్కరోజే 9 ఎఫ్‌ఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC 1A/1B) ఉల్లంఘన కింద 1,177 కేసులు నమోదైనట్లు వివరించారు. BNSS 126, 129 సెక్షన్ల కింద 1,179 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఒక్కరోజే 67 ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిఘా కోసం 814 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SST) మోహరించాయని అన్నారు. అక్టోబరు 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 244 ఎఫ్‌ఐఆర్(FIR)లను నమోదు చేసినట్లు వెల్లడించారు. MCC ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 33,014 కేసులు నమోదు చేశామని చెప్పారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా మొత్తం 17,652 మంది బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం ఆయుధాలు 9,217 స్వాధీనం/డిపాజిట్ చేసినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో 814 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SST) సేవలు అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












