సీఎం చంద్రబాబు భావోద్వేగ పోస్ట్

- 53 రోజుల నిర్బంధం.. మీకోసం చివరి వరకు నిలబడతా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పోస్టు పెట్టారు. కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను.
‘నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు.. 53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు.. యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది..
‘నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా 60కు పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటించారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకు.. విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు.. సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే.. వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
మీ ప్రేమను, అభిమానాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను..
‘నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి, ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నంబర్ వన్‌గా చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












