05/11/2026, Thursday · 09:02:28 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్..

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 10:56 PM రాష్ట్ర వార్తలు 11

ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్..
Want this news as a newspaper clip?Print News Clip

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో  31 ఎన్నికల సంబంధిత ఘటనలు చోటుచేసుకోగా, వీటిలో 22 ప్రత్యక్ష హింసాత్మక ఘటనలు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించి మరో 9 ఘటనలు ఉన్నట్లు వెల్లడించారు..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై తాజాగా డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ, సీపీఐఎంతో పాటు స్వతంత్ర అభ్యర్థులపై దాడులు జరిగినట్లు డీజీపీ పేర్కొన్నారు. మొత్తం 13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలు చోటుచేసుకోగా, వీటిలో 22 ప్రత్యక్ష హింసాత్మక ఘటనలు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించి మరో 9 ఘటనలు ఉన్నట్లు వెల్లడించారు..

ఎన్నికల హింసకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేయగా, మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఇప్పటివరకు 54 మందికి పైగా నిందితులను గుర్తించామని, మిగతా వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నలుగురిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకోగా, ఇద్దరిపై BNSS సెక్షన్ 170 కింద ముందస్తు నిరోధక చర్యలు చేపట్టినట్టు తెలిపారు..

మూడు సందర్భాల్లో హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారని.. పోలీసు వాహనంపై దాడి చేసిన మూకను చెదరగొట్టే క్రమంలో రెండు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించినట్టు తెలిపారు. అలాగే అభ్యర్థులకు ఎస్కార్ట్‌గా వెళ్తున్న పోలీసు వాహనంపై రాళ్ల దాడి జరగడంతో ఓ కానిస్టేబుల్ తలకు గాయమైందని.. ఒకచోట గాల్లోకి కాల్పులు జరిపినట్లు కూడా డీజీపీ ప్రకటనలో పేర్కొన్నారు.

నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించి వేయడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలు మొత్తం 16 సార్లు జరిగాయని. రాళ్లు, కర్రలతో దాడులకు సంబంధించి ఆరు ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. ఈ దాడుల్లో రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం నాలుగు వాహనాలకు నిప్పుపెట్టారని చెప్పుకొచ్చారు.

రెండు ఇళ్లపై దాడి చేయగా, ఒక ఇంటిని ఎర్త్‌మూవర్‌తో కూల్చివేశారని.. ఓ అభ్యర్థితో సహా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో మూడు ఘర్షణల్లో పలువురు గాయపడ్డారని తెలిపారు. మూడు చోట్ల రాస్తారోకోలు, రోడ్ల దిగ్బంధం జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.

జిల్లాల వారీగా మొత్తం 31 ఘటనలు నమోదయ్యాయని.. అనంతపురం – 8, అన్నమయ్య – 3 , వైఎస్సార్ కడప – 3, ప్రకాశం – 3 , తిరుపతి – 3 , చిత్తూరు – 2 , శ్రీ సత్యసాయి – 2 , పల్నాడు – 2 , నెల్లూరు – 1 , కర్నూలు – 1 , మార్కాపురం – 1 ,నంద్యాల – 1 , ఏలూరులో ఒక కేసు నమొదైందన్నారు..

పార్టీలతో సంబంధం లేకుండా హింసకు పాల్పడిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థుల పత్రాలను చించివేస్తే నాన్‌-బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కేవలం దాడులు చేసిన వారే కాకుండా, హింసను ప్రేరేపించినవారు, మూకలను సమీకరించిన నాయకుల పాత్రపైనా విచారణ ఉంటుందని తేల్చిచెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లు, ఆయుధాలతో తిరగడాన్ని సహించబోమన్నారు..

సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. అభ్యర్థులు, ఎన్నికల సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా ఎన్నికల హింస, బెదిరింపులు, అడ్డంకులు ఎదురైతే తక్షణమే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని డీజీపీ ప్రజలకు పిలుపునిచ్చారు..

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

DGP SeriousElectionViolence

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News