05/11/2026, Thursday · 09:02:33 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఘనంగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూబీ జూబ్లీ వేడుకలు

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 10:14 PM రాష్ట్ర వార్తలు 7

ఘనంగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూబీ జూబ్లీ వేడుకలు
Want this news as a newspaper clip?Print News Clip
  • 40వ వార్షికోత్సవ వేడుకలను
  • ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్,గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు
  • డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్

దేశంలోనే తొలి వైద్య విశ్వవిద్యాలయంగా ఏర్పాటైన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రూబీ జూబ్లీ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ వెల్లడించారు.

నవంబర్ 1, 2026 కి యూనివర్సిటీ ఏర్పాటై 40 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా అక్టోబర్ 26 సోమవారం విజయవాడ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సిల్వర్ జూబ్లీ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రిజిస్ట్రార్ సాయి సుధీర్‌తో కలిసి వైస్ ఛాన్సలర్ వేడుకల వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా డాక్టర్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దూరదృష్టితో 1986లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం వైద్య విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్టీఆర్ ఆలోచనతో ప్రారంభమైన ఈ విద్యా సంస్థ నాలుగు దశాబ్దాలుగా వైద్య, ఆరోగ్య విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ, అంచెలంచెలుగా విస్తరించిందని పేర్కొన్నారు.

 ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు

అక్టోబర్ 26 న ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రూబీ జూబ్లీ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వైస్ ఛాన్సలర్ తెలిపారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె. రమేశ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారని వెల్లడించారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తరఫున గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉపరాష్ట్రపతికి విమానాశ్రయంలో స్వాగతం పలికి వేడుకలకు తీసుకువస్తారని వివరించారు. ఈ కార్యక్రమం సుమారు గంటా పది నిమిషాల పాటు కొనసాగుతుందని తెలిపారు.

 580 కి పైగా కళాశాలలకు అనుబంధ విశ్వ విద్యాలయం

ప్రారంభంలో కొద్ది కళాశాలలతో ప్రారంభమైన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు 580 కి పైగా కళాశాలలకు అనుబంధంగా కొనసాగుతూ విశేష అభివృద్ధి సాధించిందని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు.

విశ్వవిద్యాలయం పరిధిలో 18 ప్రభుత్వ, 20 ప్రైవేట్ వైద్య కళాశాలలు కలిపి మొత్తం 38 మెడికల్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రెండు ప్రభుత్వ, 15 ప్రైవేట్ డెంటల్ కళాశాలలు, 280 కి పైగా నర్సింగ్ కళాశాలలు, సుమారు 95 ఫిజియోథెరపీ కళాశాలలు అనుబంధంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆయుష్ విభాగంలో ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి కళాశాలలు కూడా వైద్య విద్యను అందిస్తున్నాయని తెలిపారు.

40 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక సావనీర్

విశ్వ విద్యాలయం నాలుగు దశాబ్దాల ప్రస్థానం, సాధించిన విజయాలు, వైద్య విద్యారంగానికి అందించిన సేవలను ప్రతిబింబించేలా ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించనున్నట్లు వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. ఈ చారిత్రక వేడుకలకు అనుబంధ కళాశాలల నుంచి వెయ్యి మందికి పైగా వైద్య విద్యార్థులు, వివిధ విభాగాల అధిపతులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.

వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు రిసెప్షన్, సావనీర్, ప్రోటోకాల్ తదితర విభాగాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అతిథుల ఆహ్వానం నుంచి కార్యక్రమ నిర్వహణ వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నామని డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు.

వైద్య విద్యారంగంలో విశేష ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ రూబీ జూబ్లీ వేడుకలు విశ్వవిద్యాలయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలవనున్నాయని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్, పరిశోధన మరియు అభివృద్ధి విభాగం డైరెక్టర్ (R&D)డా. సూర్య ప్రభ,

ప్రచురణల విభాగం డైరెక్టర్

డా. కె. సుధ లు పాల్గొన్నారు..

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Jubilee CelebrationsNTRHealthUniversityRuby

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News