05/11/2026, Thursday · 08:58:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జనసేన బలపడడానికి ఇంకా పాతికేళ్లు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:55 AM రాష్ట్ర వార్తలు 15

జనసేన బలపడడానికి ఇంకా పాతికేళ్లు
Want this news as a newspaper clip?Print News Clip

ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పష్టికరణ

ఒక పార్టీ ఎదుగుదల రాత్రికి రాత్రి జరగదు

టీడీపీ బలమైన పార్టీ కావడం వల్లే గత ఎన్నికల్లో గెలిచాం

స్థానిక సర్దుబాటులో తలనొప్పులు, ఇబ్బందులు, తుపాను ఒత్తిడి

అయినా చంద్రబాబు అందరికీ సర్దిచెప్పి ఒప్పించారు

ఈ ఎన్నికలు మా పాలనకు రెఫరెండం కాదు : సీఎం చంద్రబాబు

 అమరావతి : తెలుగుదేశం బలమైన పార్టీ అని, ఆ స్థాయికి జనసేన రావడానికి ఇంకా పాతికేళ్లు పడుతుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఒక పార్టీ ఎదుగుదల రాత్రికి రాత్రి జరగదని, ఆ ప్రాక్టికాలిటీ తనకు బలంగా ఉందని తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి మంగళవారం ఆయన స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రధాని అండగా ఉండడం, టీడీపీకి ఉన్న సంస్థాగత నిర్మాణం, అనుభవం వల్ల గెలిచామన్నారు.

జనసేనకు ఉండే బలం ఉన్నా, అది అన్ని స్థాయిల్లో లోతుగా వెళ్లడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. పార్టీ పెట్టినప్పుడే ఇది పాతికేళ్ల ప్రయాణం అని చెప్పానని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటులో తలనొప్పులు, ఇబ్బందులు వచ్చాయన్నారు. అదే సమయంలో తుపాను ఒత్తిడి కూడా ఉందన్నారు. అయినా చంద్రబాబు నచ్చజెప్పి సర్దుబాటు చేశారని తెలిపారు. స్థానిక ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి రిఫరెండం కావని, కాబోవని చెప్పారు. ఔత్సాహికులంతా నామినేషన్లు వేశారని, అయితే తాము ఖరారు చేసిన వారికే బీ ఫారాలు ఇస్తామన్నారు. బి ఫారం తీసుకున్న వాళ్లకే పని చేయాలన్నారు.

ఎక్కడా స్నేహ పూర్వక పోటీ ఉండదు : చంద్రబాబు

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ సహా అన్ని హామీలు అమలు చేశామని, అయినా స్థానిక సంస్థల ఎన్నికలు తమ పాలనకు రిఫరెండం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల వల్ల తాము ఏ ప్రాంతంలో ఎలా ఉన్నామో తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. అయితే ఎక్కడా స్నేహ పూర్వక పోటీ ఉండదన్నారు. తన రాజకీయ జీవితంలో సీట్ల సర్దుబాటుపై ఇంత కసరత్తు ఎప్పుడూ చేయలేదన్నారు. ఎన్నికలు పెట్టడం వైఎస్సార్‌సీపీకి ఇష్టం లేదని.. వాళ్లే హింస చేసి, మళ్లీ వాళ్లే కోర్టులకు వెళ్లారని తెలిపారు. ఎన్నికలు ప్రకటించాక 62 పిటిషన్లు వేశారన్నారు.

నామినేషన్ల సమయంలో పోలీసులు మైకులు పెట్టి నామినేషన్లు వేసే వాళ్లను పోలీసు జీపుల్లో తీసుకెళతామని చెప్పినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు టీడీపీ 9,800, వైఎస్సార్‌సీపీ 8,800, జనసేన 2,400, ఎంపీటీసీ అభ్యర్థులుగా 46 వేల మంది, జెడ్పీటీసీ అభ్యర్థులుగా 4,770 మంది నామినేషన్లు వేశారని తెలిపారు.

 వైఎస్సార్‌సీపీ నామినేషన్లు కూడా తమ వాళ్లే వేశారంటున్నారని, బి ఫారం ఇచ్చినప్పుడే ఏ పార్టీ అన్నది తెలుస్తుందన్నారు. తన రాజకీయ జీవితంలో హింసకు తావులేదన్నారు. ఎన్నికల కమిషన్, ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌ (సర్‌)పై ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ.. గెలిచినప్పుడు ఎవరూ మాట్లాడరని, ఓడిపోయినప్పుడు రాజకీయం కోసం మాట్లాడుతారని అన్నారు. కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడుల్లో వాళ్లు గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా పనిచేసినట్టని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే సరిగా పనిచేయనట్టా అని ప్రశి్నంచారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Jana Senapatronsstrengthen

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News