మురసు తుఫాన్‌పై సర్కార్ హైఅలర్ట్.. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అనిత ఆదేశం

అమరావతి : మురసు తీవ్రతుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేపట్టింది. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు, రేపు.. రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అర్ధరాత్రి- తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపిన హోంమంత్రికి ప్రఖర్ జైన్ తెలిపారు.దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్లు కృషి చేయాలని.. ఎలక్ట్రికల్ లైన్ల మీద చెట్లను ముందుగానే తొలగించాలని తెలిపారు. విద్యుత్, నెట్‌వర్క్ సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారుల బోట్లు, వలలు సురక్షితంగా ఉంచుకునేలా అలర్ట్ చేయాలని సూచనలు చేశారు. అధికార యంత్రాంగం 48గంటల పాటు హైఅలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. తుఫాన్‌ను ఎదుర్కోడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు.
తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఈదురుగాలులకు తెగిన విద్యుత్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న వెంటనే అధికారులకు తెలపాలన్నారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని తెలిపారు. ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం తుఫాన్ గమనాన్ని పర్యవేక్షిస్తున్నాయన్నారు. అధికారిక హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలని.. వదంతులు నమ్మవద్దన్నారు. తుఫాన్ సమస్యలకు మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా తక్షణ పరిష్కారం చూపనున్నట్లు వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












