05/11/2026, Thursday · 09:02:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తెలంగాణలో 67 సంస్థలకు TGSPF భద్రత.. ఏడాదికి రూ.130 కోట్ల ఆదాయం: స్వాతి లక్రా

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 10:25 AM రాష్ట్ర వార్తలు 6

తెలంగాణలో 67 సంస్థలకు TGSPF భద్రత.. ఏడాదికి రూ.130 కోట్ల ఆదాయం: స్వాతి లక్రా
Want this news as a newspaper clip?Print News Clip

 తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం(TGSPF) 36వ ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా టీజీఎస్‌పీఎఫ్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1991లో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళ చట్టం ప్రకారం TGSPF ఏర్పాటు అయిందన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) తరహాలో TGSPF ఏర్పాటు అయిందని చెప్పారు. తెలంగాణలోని కీలక ప్రభుత్వ, పారిశ్రామిక సంస్థలకు సమర్థవంతమైన రక్షణ, భద్రత కల్పించడం TGSPF ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు.ప్రభుత్వ కీలక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక యూనిట్లు, విద్యుత్ ప్రాజెక్టులు, ఆసుపత్రులు, దేవాలయాలు, ఆర్థిక సంస్థలు, ఇతర కీలక కేంద్రాలకు కూడా టీజీఎస్‌పీఎఫ్ భద్రత కల్పిస్తుందని అన్నారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి, రాష్ట్ర సచివాలయం, తెలంగాణ హైకోర్టు వంటి ముఖ్యమైన సంస్థలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67 సంస్థలకు TGSPF భద్రతా సేవలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వీటిలో 50 సంస్థలు చెల్లింపు ప్రాతిపదికన, 17 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చెల్లింపులు లేని విధానంలో భద్రతా సేవలు అందుతున్నాయన్నారు.

టీజీఎస్‌పీఎఫ్ తన సేవలు పొందుతున్న సంస్థల నుంచి సంవత్సరానికి సుమారు రూ.130 కోట్ల ఆదాయం పొందుతోందని డీజీ తెలిపారు. TGSPF అందిస్తున్న భద్రతా సేవలకు గుర్తింపుగా పలు కీలక సంస్థల నుంచి ఈ దళం సేవలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, న్యాయస్థానాలు, భవిష్యత్తులో ఏర్పాటయ్యే ఇతర కీలక సంస్థలకు భద్రత కల్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మెట్రో రైలు వ్యవస్థ భద్రతా అవసరాలను అంచనా వేసేందుకు ప్రాథమిక అధ్యయనం, సంయుక్త భద్రతా సర్వే నిర్వహించేందుకు అంగీకారం తెలిపిందని అన్నారు. దీంతో మెట్రో రైలు భద్రతా రంగంలోనూ TGSPF సేవలను విస్తరించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు.

రాష్ట్రంలోని 89 ప్రభుత్వ ఆసుపత్రుల్లో TGSPF సేవలను వినియోగించుకునే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని స్వాతి లక్రా తెలిపారు. ఇందుకోసం కొత్తగా 1,211 పోస్టులను కల్పించాల్సి ఉండగా, ఈ ప్రతిపాదన ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉందన్నారు. ప్రభుత్వ సహకారం, అవసరమైన అనుమతులు లభిస్తే TGSPFను 10,000 మంది సిబ్బంది కలిగిన సంస్థగా విస్తరించే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై అధిక ఆర్థిక భారం పడకుండా ఆదాయాన్ని పెంచడంతోపాటు, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించవచ్చన్నారు. TGSPF భద్రతా అకాడమీ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు.

ఈ అకాడమీ ద్వారా సిబ్బందికి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీజీఎస్‌పీఎఫ్ డీజీ తెలిపారు. కీలక సంస్థల భద్రతను మరింత పటిష్టం చేయడం, విధుల నిర్వహణలో సామర్థ్యాన్ని పెంచడం, కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం TGSPF సాంకేతిక ఆధునికీకరణలో ప్రధాన ప్రాధాన్యాలుగా ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా ఆధునిక యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలు, బ్యాగేజీ స్క్రీనింగ్ పరికరాలు, పేలుడు పదార్థాలను గుర్తించే పరికరాలు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై దృష్టి సారిస్తున్నామని స్వాతి లక్రా పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Swati LakraTGSPFsecurityentitiesTelanganaRevenuecroreper

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News