05/11/2026, Thursday · 08:58:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మనదేశ జనాభా కన్నా దేవతల సంఖ్యే ఎక్కువ!

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:00 PM రాష్ట్ర వార్తలు 28

మనదేశ జనాభా కన్నా దేవతల సంఖ్యే ఎక్కువ!
Want this news as a newspaper clip?Print News Clip
  • నా మతం సైన్సు! నేను దానిని ఆరాధిస్తాను.
  • సర్‌ సి.వి. రామన్‌

పొద్దున్నే లేచి రోడ్డుమీద మనుషుల్ని చూడండి. హడావుడిగా వెళుతుంటారు. ఉద్యోగాలకు, వ్యాపారానికి, ఇతర కార్యకలాపాలకు పోయేవాళ్ళు లేదా స్నేహితులు, బంధువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనేకమంది అనేక రకాలుగా కనబడతారు. నడుస్తూనో, వాహనాల మీదో వేగంగా వెళుతుంటారు. నిజానికి వాళ్ళంతా అంత తీరిక లేనివాళ్ళా? సమాజానికో, దేశానికో పాటుపడుతున్నవాళ్ళా? అలాంటి వాళ్ళు అతికొద్దిమంది ఉన్నా, ఎక్కువ మంది వారివారి దైనందిన, స్వార్థ కార్యకలాపాల కోసం వెళ్ళేవాళ్ళే అధికశాతం మంది ఉంటారు. వారి వేగానికి, వారి తొందరకు, వారి హడావుడికి మరొక బలమైన కారణం ఉంది. అది వారు మోస్తున్న చెత్త!
వారి వీపుల మీద, భుజాల మీద మనకు చెత్తమూటలు కనిపించవు. ఆ చెత్త ఉన్నది వారి మెదళ్ళలో! చెత్త అంటే మానసిక ఒత్తిడి. మరీ ముఖ్యంగా ఆధునికత పెరుగుతున్న కొద్దీ, నవనాగరిక యుగంలోకి వెళుతున్న కొద్దీ మనుషులు మోసే చెత్త ఎక్కువవుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా, పనికిరాని పరిజ్ఞానమంతా మెదళ్ళలో నింపుకోవటం. ఒక్కోసారి మైండ్‌ బ్లాక్‌ అయి, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉండటం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాళ్ళే తమ మెదళ్ళను పక్కనపెట్టి మాట్లాడుతుంటారు... మనమనేదే మంటే... 'అయ్యా! మీరు మనుషులు కదా! మానవత్వ మున్నవారు కదా! కాస్త, మీ మెదడులోని చెత్తనంతా పక్కకుతోసి కొంచెం వివేకంతో ఆలోచించగూడదా?' అని మాత్రమే అడుగుతున్నాం. ఆ చెత్త అనేది మూఢ విశ్వాసం కావొచ్చు. అహంకారం కావొచ్చు. అహంభావం కావొచ్చు. ప్రపంచమంతా ఒక్కటే. మనుషులంతా ఒక్కటే అన్న భావం ఉన్నవాడికి మెదడులో చెత్త ఉండదు. ''ఏ దేశం వాడైనా, ఏ జాతివాడైనా, ''హోమో సేపియన్స్‌'' అనే శాస్త్రీయ నామంతో పిలవబడే ఈ మనుషులంతా ఒక్కతల్లి పిల్లలే..'' అన్న అవగాహన ఉన్నవాడికి మనిషి మీద, మంచితనం మీద, మానవత్వం మీద గట్టి నమ్మకముంటుంది. అదిలేకుండా ఈ మనుషుల్ని, దేశాలవారీగా, జాతులవారీగా, కులాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టాలని నిరంతరం ఎవడైనా ఆలోచన చేస్తున్నాడంటే... వాడి మెదడులో కొన్ని టన్నుల చెత్త పేరుకుపోయి ఉందన్నమాట! ఇంక వాడికి విశాల భావాలు ఎలా ఉంటారు?
ఇటీవల లుధియానాలో జరిగిన ఒక సంఘటన అన్ని మాధ్యమాల్లో ప్రధానంగా వచ్చింది. ఒక కుర్రవాడు తన తోటి విద్యార్థిని గాలిపటాలిస్తానని తీసుకెళ్ళి దారుణంగా హత్య చేశాడు. శరీరం ఆరు భాగాలుగా నరికి, రక్తం తాగి, మాంసం తిని, అతని గుండె తీసి తాము చదువుకునే పాఠశాలలో పడేసి, శరీర భాగాలు చెత్తకుప్పలో గిరాటేసి... చక్కాపోయాడు. చంపబడిన వాడు తొమ్మిదేండ్ల దీపూకుమార్‌. అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హంతకుడికి పచ్చి మాంసం తినే అలవాటు, రక్తం తాగే అలవాటు ఉన్నాయని తేలింది. మనుషులు మానవనైజాన్ని మరిచి విపరీతంగా ప్రవర్తించడం బాధకలిగించే విషయం. పసి పాపల్నీ, వృద్ధుల్నీ లైంగిక దాడులు, ముసలి తల్లిదండ్రుల్ని చెత్తకుప్పలకు అంకితమివ్వడం వంటి వార్తలు రోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిజంగా దేవుడనే వాడుంటే మరి ఇలాంటివి ఎందుకు జరిపిస్తున్నాడూ?
ఆలోచిస్తే మనకు రెండు, మూడు విషయాలు అవగతమౌతున్నాయి. మనిషిని పుట్టించి, పెంచి, రక్షించే దేవుడు తన పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పలేని అసమర్థుడైనా కావాలి. లేదా అతనే హింసను ప్రేరేపించే క్రూరుడైనా కావాలి. లేదా అతనికి తన కన్నబిడ్డలపై అజమాయిషీ చేయగల సత్తాలేని నిర్భలుడైనా కావాలి! ఇవేవీ కాకపోతే, అసలాయన లేకుండానైనా ఉండాలి...!!
నిన్న మొన్న జరిగిన సంగతి! నోట్లు రద్దయ్యాయి. కొత్తనోట్లు అందుబాటులోకి రానేలేదు. ఆ మధ్యలోనే నకిలీనోట్లు స్వైర విహారం చేశాయి. అంటే ఏమిటీ? మనిషికి తను చేస్తున్న 'చెడు'పైనే నమ్మకముంది. ఏదో శక్తి తనను నడిపిస్తోందన్న భయంలేదు. తనుచేసే చెడును ఎవరో గమనిస్తున్నారు. తనకు శిక్షవేస్తారు... అని ఏమాత్రం భయపడడం లేదు. చూడండి. దైవభక్తిని బాహాటంగా ప్రకటించే అధికారులు, అధికారంలో ఉన్న నేతలు అందరూ లూటీలు, మోసాలు, దౌర్జన్యాలు చేసిన ఏనుగుల్ని ద్వారాలు తెరిచి, సగౌరవంగా తప్పించి బయటికి పంపుతున్నారు. చిన్న మొత్తాలకు కక్కుర్తి పడ్డ చీమల్ని, దోమల్ని పట్టి, పెద్ద ఘనకార్యం చేసినట్టు తమ వీపులను తామే చరుచుకుంటున్నారు.
 అబ్రహం లింకన్‌ ఇలా అన్నారు... ''బైబిల్‌ నాకు సంబంధించిన పుస్తకం కాదు. క్రైస్తవం నా వృత్తి కాదు. నేనేదైనా మంచి చేస్తే, నాకు మంచిగా అనిపిస్తుంది.. నేనేదైనా చెడుచేస్తే నాకు అది చెడుగా అనిపిస్తుంది. అంతే అదే నా మతం... నేను చాలా మెల్లగా నడుస్తాను. అయితే వెనకవైపుకి మాత్రం ఎప్పుడూ నడవను.'' ఈ రోజు మనం ఆలోచించాల్సిందే మంటే ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని మతాలు, ఇన్ని పార్థనా స్థలాలు, ఇంత మంది మతాధిపతులు, పూజారులు, స్వాములూ ఉన్నప్పుడు, ఇన్ని మిలియన్ల మత విశ్వాసకులు ఉన్నప్పుడు మరి సమాజంలో అతి దారుణమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మనుషుల అమానవీయ ప్రవర్తన ఎందుకు పేట్రేగిపోతోంది? అసలు దేవుడి పేరుతోనే దౌర్జన్యాలు, వ్యాపారాలు జరుగుతున్నాయి కదా? అనాది నుండి అత్యాధునిక యుగందాకా పరిశీలిస్తూ వస్తే దేవుడు - మతం ప్రపంచశాంతిని స్థాపించిన దాఖలాలేమైనా ఉన్నాయా? లేవు కదా? అసలు మతాల్లోంచి పెల్లుబికిన విద్వేషాలతోనే దారుణాలు జరుగుతూ వస్తున్నాయి కదా?
బానిసత్వం, అంటరానితనం, జాతి, వర్ణ, వర్గ వివక్షల వల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా సమాజాలు బాగుపడిన ఉదాహరణలు న్నాయా? లేదు కదా? మతాలు శాంతిని చేకూర్చడమే నిజమైతే, మరి మతోన్మాదులెందుకు శాంతిని ఘోరంగా కాల్చేస్తున్నారూ? బాలీవుడ్‌ గీతరచయిత జావెద్‌ అక్తర్‌ ఇలా అన్నారు.. ''మతం గురించి చర్చించడం అంటే మనం ఎలాంటి గుహలో జీవిస్తే మంచిది అన్న విషయం చర్చించడం వంటిదే. నీవు మతాన్నే అనుసరించాలనుకుంటే, ఏమతాన్నయినా అనుసరించు. ఏం ఫరవాలేదు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలను కుంటే... ఎలా చేసుకుంటే మాత్రం ఏమిటీ?'' అని.
 స్కూల్లో చదువుకుంటున్న చిన్నారుల మీద కాల్పులు జరిపి వందలమంది ప్రాణాలు తీసిన టెర్రరిస్టు గ్రూపులనేమందాం? వారి దేవుడు వారినలా చేయమన్నాడా? పేద రైతుల భూములు లాక్కుని, వారిని నిర్వాసితుల్ని చేసి, మనం మరో శకంలోకి పోతున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే రాజకీయ నాయకుల చీకటి ఒప్పందాలు, చీకటి పనులు దైవభీతితోనే చేస్తున్నారా? నల్లధనం కొండను తవ్వుతానని అన్నాయన, చిన్న ఎలుకను కూడా పట్టలేదే? పెట్టుబడులు తెస్తానని ప్రపంచ దేశాలన్నీ తెగ తిరిగిన నాయకులు ఉన్నడబ్బు తగలేయడం తప్ప... ఒక్క పైసా బయటినుంచి తెచ్చింది లేదుకదా? మరి ఇలాంటి పనులన్నీ మళ్ళీ దైవకార్యంగా, పవిత్ర ధర్మంగానే చేస్తున్నారా? ప్రజలను ఎలాగూ మోసం చేస్తున్నారు. కనీసం తమను తాము మోసగించుకోకుండా ఉంటే బాగుంటుంది కదా? వాస్తవంలోకి వస్తే బాగుంటుంది కదా? 'ఎదుటివాడికి చెప్పేందుకే నీతులు ఉన్నాయన్న'ది అబద్ధం చేసి, కొన్నయినా పాటించి చూపితే జనానికి ఆదర్శప్రాయులవుతారు కదా? మనసుల్ని, అంతరాత్మల్ని చంపుకుని, బరితెగించి, ఇలాంటి పనులు చేసేవాళ్ళు - శాస్త్ర పరిశోధనలు ''దేవుడి ఆశీస్సుల'తో చేపట్టాలని ఉద్భోదిస్తారా? అంటే వీరికి సైన్సు గురించి ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదన్న మాట!
మతం ఎక్స్‌ఫైర్‌ అయిన మందుబిళ్ల లాంటిది. డేట్‌ అయిపోయిన మందు పనిచేయక పోగా, విషమౌతుంది. చాలా కాలంగా మతాలు దేవుడి పేరుతో సమాజంలో విషం చిమ్ముతున్నాయి. మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏదో ఓ శక్తిని నమ్ముకుంటే తప్ప, మనుగడ లేదని చెపుతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించగల వారికి విషయం బోధపడుతుంది. కనీసం ఆలోచించగలవారినైనా ఆలోచించనీయాలి కదా? ఆలోచనని చంపేసే బోధలు, ప్రవచనాలు, దైవకీర్తనలూ ఎందుకూ? మనిషికి అన్ని సౌకర్యాలు అందిస్తున్న సైన్స్‌ను పక్కన పెట్టి, మానసికంగా బలహీనులుగా తయారుచేసే లేని శక్తుల్ని నమ్ముదామా?
 ఈ దేశం ఓ దేవతల సంత అనీ, భాగవద్గీతను దూరంగా విసిరిపారేయండి అన్న భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి విశ్లేషణను ఒకసారి గమనించండి.. ''సువిశాలమైన ప్రపంచంలో మనకంటే పెద్ద భూభాగం గల దేశాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఒకే దేవుడు జన్మించాడు. క్రీ.పూ. పదివేల సంవత్సరాల నాడు ప్రపంచ జనాభా పది లక్షలు మాత్రమే. క్రీ.పూ. ఆరువేల సంవత్సరాల నాడు ఒక కోటి మాత్రమే. ఆర్యులు మనదేశానికి వచ్చినప్పుడు మన దేశ జనాభా ఒక కోటి ఉంటుందేమో... ఒక కోటి ప్రజలకు ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించారు. అంటే ఒక మనిషికి ముప్పయి మూడు మంది దేవతలు ఉన్నారన్నమాట! ఈ ముప్పయి మూడు కోట్ల దేవతల పేర్లేమిటో మనిషికి తెలియదు. ఎక్కడా రాయలేదు. ఈ దేవతలందరూ ఒకే దేశంలో పుట్టి ఈ దేశ ప్రజలకు భారమవడం లేదా? భారం తగ్గించుకోవడానికి మార్గం లేదా? ఇందరు దేవతలను పూజిస్తున్న ప్రజలు ఏమాత్రం అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు!''
దేశంలో యాభైలక్షల జ్యోతిష్యులు ఉండి ఉంటారు. మరి వీరెవరూ పెద్దనోట్ల రద్దు గురించి, ప్రజల ఇక్కట్ల గురించి ముందుగా చెప్పలేదెందుకూ? భారతప్రభుత్వం ఆమోదించిన గార్గేయ అనే జ్యోతిష్య పండితుడు ఈ జనవరి 27న ఎవరూ మాట్లాడగూడదు. మాట్లాడితే అనర్థం జరుగుతుంది అని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఎవరూఏమీ మాట్లాడకుండా ఎలా గడపగలరూ? అర్థం లేని సూచన! ఇలాంటి వ్యర్థమైన సూచనలకు బదులు, ఇటీవల పార్వతీపురం, రాయగడ్‌ మధ్య రైలు పట్టాలు తప్పి, ప్రజలు ప్రాణాలు కోల్పోకముందు ఈయనో, ఈయనలాంటి మరో జ్యోతిష్యులో హెచ్చరిక చేసి ఉంటే బావుండేది కదా? పనికొచ్చే విషయాలు చెప్పలేకపోతే గమ్మున ఉండిపోతే గౌరవంగా ఉంటుంది.
మోడీ ఎన్నికయితే విదేశాల్లో ఉన్న నలభైలక్షల కోట్ల నల్లధనాన్ని దేశంలోకి తీసుకొస్తారని బాబా రామ్‌దేవ్‌ సెలవిచ్చారు. మోడీ అధికారంలోకి వస్తేడాలర్‌ విలువ నలభై రూపాయలకి దిగువ ఉండేట్టు చూస్తారని ఆర్టాఫ్‌ లివింగ్‌ రవిశంకర్‌ ప్రవచించారు. ఇవన్నీ పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన విషయాలే! మరి ఈ జ్ఞాన గురువుల జోస్యాలు తప్పాయి. తప్పయ్యాయి. వారి అజ్ఞానం బయటపడింది. మరి మనం వారి జ్ఞానం ఇలా తగలబడిందేమని ప్రశ్నించాలి కదా? సంప్రదాయానికి - అభ్యుదయానికి మధ్య ఇది సంధియుగం. మనం చాలా అప్రమత్తతో వ్యవహరిస్తూ ఉండాల్సిన సమయం. కొందరు ఉన్నతమైన పదవుల్లో, స్థాయిలో ఉన్నా... ఉన్నతమైన ఆశయాలు, ఆదర్శాలు లేనివారై ఉండొచ్చు. వారిని చూసి బాధపడాల్సింది మనం కాదు. వారిని చూసుకుని వారే బాధపడాల్సి ఉంటుంది. అయినా అది వారి ఇష్టం! కొంతమంది 'మెగలో మేనియా' అనే స్థితిలో ప్రవర్తిస్తుంటారు. వైద్యపరంగా అదొక మానసిక వ్యాధి. వారు ఆ స్థితిలో ఉన్నట్టు వారికే తెలియదు.
సైన్సు-కార్యకర్తలు, మానవవాదులు ఈ విషయాలు అర్థం చేసుకుని ప్రవర్తించాలి. ప్రఖ్యాత రచయిత జార్జి బెర్నాండ్‌ షా మాటల్ని మనం గుర్తుంచుకోవాలి. ''తప్పుడు సమాచారమిచ్చే వారి గురించి జాగ్రత్త వహించండి. అమాయకత్వం కన్నా అది అతి ప్రమాదకరమైంది.''

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

populationnumbergodsgreatercountry

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News