ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో.. 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమలు..!

- జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి
- నేటి (నవంబర్ 3) సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు
- 21 మండలాల్లో నవంబర్ 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
కడప : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు నిశ్శబ్ద కాలం (సైలెన్స్ పీరియడ్) నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
నవంబర్ 5న పోలింగ్ జరగనున్న 21 మండలాల్లో నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటలకే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని పూర్తిగా ముగించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994లోని సెక్షన్ 214 ప్రకారం నిశ్శబ్ద ప్రచార కాలంలో బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, వీధి సభలు, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని కలెక్టర్ పేర్కొన్నారు. సినిమా, దూరదర్శన్, ఇతర దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం కూడా నిషేధమని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారానికి అనుమతి లేదు..
నిశ్శబ్ద ప్రచార కాలంలో దూరదర్శన్, కేబుల్ ప్రసారాలు, సినిమా ప్రదర్శనలు, బహిరంగ ప్రదేశాల్లో దృశ్య శ్రావణ మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రచారం చేయరాదని కలెక్టర్ తెలిపారు. సామాజిక మాధ్యమాలు, ఇ-పేపర్స్, బల్క్ మెసేజీలు, వాయిస్ మెసేజీల ద్వారా కూడా ప్రచారం నిషేధమని స్పష్టం చేశారు. మీడియా ధ్రువీకరణ కమిటీ అనుమతి పొందిన ప్రకటనలు సైతం ఈ 48 గంటల సమయంలో ప్రసారం చేయరాదని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలపై నిరంతరం నిఘా ఉంచి ఉల్లంఘనలను గుర్తించాలని ఆదేశించారు.
వాహనాలు, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు..
నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచార వాహనాలు, లౌడ్‌స్పీకర్ల వినియోగానికి ఇచ్చిన అనుమతులు రద్దవుతాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగించే వాహనాలు, ధ్వనివర్ధక పరికరాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ రోజున ప్రతి అభ్యర్థి తన వ్యక్తిగత ప్రయాణానికి ఒక్క వాహనాన్ని మాత్రమే వినియోగించుకోవచ్చని, దానికి సంబంధిత అధికారి జారీ చేసిన అనుమతి పత్రాన్ని వాహనం ముందు అద్దంపై ప్రదర్శించాలని సూచించారు. ఓటర్లను ఉచితంగా వాహనాల్లో తరలించడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బయటి వ్యక్తులు ఎన్నికల ప్రాంతాలను విడిచి వెళ్లాలి...
పోలింగ్ జరిగే గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలో ఓటర్లు కాని రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఇతర వ్యక్తులు నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడ ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు, పోలీసులు వసతి గృహాలు, కల్యాణ మండపాలు, సామాజిక భవనాలు, అతిథి గృహాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పరిశీలించాలని సూచించారు.
మద్యం విక్రయాలు, పంపిణీపై నిషేధం..
నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, అలాగే ఓట్ల లెక్కింపు రోజున సంబంధిత ఎన్నికల ప్రాంతాల్లో మద్యం విక్రయాలు, పంపిణీ పూర్తిగా నిషేధమని కలెక్టర్ తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని, అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిబంధనలు..
పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల లోపల, 100 మీటర్ల పరిధిలో ఓట్ల కోసం ప్రచారం చేయడం, కరపత్రాలు, బ్యానర్లు ప్రదర్శించడం నిషేధమని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో అభ్యర్థులు ఎన్నికల బూత్‌లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా ముందస్తు అనుమతితో మాత్రమే పరిమిత ఏర్పాట్లతో బూత్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రత కలిగిన వ్యక్తులు తమ భద్రతా సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాల లోపలికి లేదా 100 మీటర్ల పరిధిలోకి ప్రవేశించరాదని తెలిపారు.
ఉల్లంఘనలపై కఠిన చర్యలు...
ఎన్నికల నిబంధనల అమలుకు ప్రత్యేక బృందాలు, తనిఖీ బృందాలు, నిఘా బృందాలను రంగంలోకి దించాలని అధికారులను ఆదేశించారు. నగదు, మద్యం, బహుమతుల పంపిణీ, అనధికార వాహనాల వినియోగం, బయటి వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనలను తేదీ, సమయంతో సహా చిత్రీకరించి, సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని తెలిపారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పోలీసు అధికారులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఉత్తర్వుల ప్రతులను పోలింగ్ కేంద్రాలు, సంబంధిత కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. నిబంధనల అమలుపై నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారికి కూడా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నిబంధనలు కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
21 మండలాల్లో 599 పోలింగ్ కేంద్రాలు...
జిల్లాలోని 21 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు మొత్తం 599 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏడు మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు మాత్రమే, ఐదు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే, మిగిలిన తొమ్మిది మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని వివరించారు.
ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












