ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడపలో ఎల్ఐసీ ఉద్యోగుల సంఘీభావ ప్రదర్శన

- ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 2, 3 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావంగా AIIEA పిలుపు మేరకు సోమవారం కడపలో ఎల్ఐసీ ఉద్యోగులు భోజన విరామ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్ అధ్యక్షులు అవధానం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి ఉన్న 60.72 శాతం వాటాను ప్రైవేటు సంస్థకు విక్రయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. లాభదాయకంగా పనిచేస్తున్న బ్యాంకును ప్రైవేటీకరించడం సమర్థనీయం కాదని, విదేశీ ఆర్థిక సంస్థల ఆధిపత్యం దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి హానికరమని హెచ్చరించారు. ఐడీబీఐలో ప్రభుత్వ వాటా కనీసం 51 శాతం కొనసాగుతుందని 2003లో పార్లమెంటుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.
ఈ ప్రదర్శనలో యూనియన్ నాయకులు అక్బర్ బాషా, వారిజాతమ్మ, అమీనా పర్వీన్, నజీరుల్లా, వసుప్రద, గౌస్, రాజు, సాధక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐడిబిఐ యూనియన్ నాయకులు రవితేజ, మహిత, మధుసూదన్ రెడ్డి, దుర్గేష్ కులకర్ణి, వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












