ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ...

- జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
- అభ్యర్థులకు భద్రత కల్పించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు
వైఎస్సార్ కడప జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.
శుక్రవారం కడపలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు... జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయ ప్రాంగణంతో పాటు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్లు, 500 మీటర్ల పరిధుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని, తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. కేంద్రాల వెలుపల నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
కడప, రాజంపేట, మైదుకూరు ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు అవసరమైన పోలీసు రక్షణ కల్పించి, నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
పోలీసు నియంత్రణ గది నిరంతరం అందుబాటులో ఉంటుందని, అత్యవసర సహాయం కోసం 112 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని అభినందించారు. ఇదే విధంగా ఎన్నికల తదుపరి ప్రక్రియలోనూ భద్రతా చర్యలను కొనసాగిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












